భారత మహిళల జట్టుకు చుక్కెదురు

19 Feb, 2018 05:44 IST|Sakshi

మూడో టి20లో దక్షిణాఫ్రికా విజయం

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టి20 సిరీస్‌ దక్కించుకోవాలనుకున్న భారత మహిళల జట్టు జోరుకు బ్రేక్‌ పడింది. వరుసగా రెండు టి20ల్లో గెలుపొందిన హర్మన్‌ప్రీత్‌ బృందం మూడో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మిడిలార్డర్‌ వైఫల్యంతో టీమిండియా 5 వికెట్లతో ఓడింది. తొలుత టీమిండియా 17.5 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌటైంది.

మిథాలీ రాజ్‌ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరినా... మరో ఓపెనర్‌ స్మృతి మంధాన (37; 5 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), వేద కృష్ణమూర్తి (23; 4 ఫోర్లు) ధాటిగా ఆడారు. ఒకదశలో 91/2తో పటిష్టంగా కనిపించిన భారత్‌ను సఫారీ పేసర్‌ షబ్నమ్‌ 5 వికెట్లతో దెబ్బతీసింది. అనంతరం సఫారీలు ల్యూస్‌ ( 41; 5 ఫోర్లు), కెప్టెన్‌ నికెర్క్‌ (20 బంతుల్లో 26; 5 ఫోర్లు), ట్రియాన్‌ (34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో మరో ఓవర్‌ మిగిలుండగానే విజయం సాధించారు. నాలుగో మ్యాచ్‌ బుధవారం సెంచూరియన్‌లో జరుగనుంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు