పంజాబ్‌ ఊపిరి పీల్చుకో.. అతడొస్తున్నాడు

22 Dec, 2019 12:52 IST|Sakshi

హైదరాబాద్‌: ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో భాగంగా పెర్త్‌ స్కాచర్స్‌ తరుపున ఆడుతున్న ఈ పేసర్‌ ఓ స్టన్నింగ్‌ క్యాచ్‌తో అందరినీ షాక్‌కు గురిచేశాడు. బీబీఎల్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌-పెర్త్‌ స్కాచర్స్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆ సంఘటన చోటుచేసుకుంది. మెల్‌​బోర్న్‌ బ్యాటింగ్‌ సందర్భంగా ఆ జట్టు ఆల్‌రౌండర్‌ క్రిస్టియాన్‌ లాంగాన్‌ వైపు భారీ షాట్‌ కొట్టాడు. అయితే అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న జోర్డాన్‌ గాల్లోకి అమాంతం ఎగిరి క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో షాక్‌కు గురైన క్రిస్టియాన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్‌ చేసింది. దీంతో ఈ స్టన్నింగ్‌ క్యాచ్‌ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.

ఇక తాజాగా ముగిసిని ఐపీఎల్‌ వేలంలో క్రిస్‌ జోర్డాన్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రూ. 3 కోట్లకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో పంజాబ్‌కు జోర్డాన్‌ రూపంలో బౌలర్‌తో పాటు మంచి ఫీల్డర్‌ దొరికాడంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ‘పంజాబ్‌ ఊపిరి పీల్చుకో.. మిమ్మల్ని గెలిపించడానికి జోర్డాన్‌ వస్తున్నాడు’ అంటూ మరో నెటిజన్‌ సరదాగా కామెంట్‌ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పెర్త్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మెల్‌బోర్న్‌ 185 పరుగులకే పరిమితమై ఓటమిచవిచూసింది. ఐపీఎల్‌లో అంతగా మంచి రికార్డులు లేని జోర్డాన్‌ ఈసారి పంజాబ్‌ తరుపున ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. ఇక ఐపీఎల్‌ చరిత్రలో పంజాబ్‌ ఒక్కసారి కూడా టైటిల్‌ నెగ్గలేదు. తాజాగా కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని నయా పంజాబ్‌ జట్టు వచ్చే సీజన్‌లో శక్తిమేర పోరాడాలని భావిస్తోంది. 

మరిన్ని వార్తలు