గేల్ను పక్కన పెట్టేశారు!

24 May, 2016 16:55 IST|Sakshi
గేల్ను పక్కన పెట్టేశారు!

మెల్బోర్న్: ఆస్ట్రేలియా టీవీ వ్యాఖ్యాతపై శృంగారపరమైన వ్యాఖ్యలు చేసిన వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ వచ్చే ఏడాది జరిగే బిగ్ బాష్ లీగ్ లో పాల్గొనే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. క్రిస్ గేల్  ప్రాతినిథ్యం వహించే ఆస్ట్రేలియా ఫ్రాంచైజీ మెల్ బోర్న్  రెనగేడ్స్ అతన్ని పక్కన పెట్టేసింది. వచ్చే ఏడాది బిగ్ బాష్ లీగ్ సీజన్కు గేల్ను  తీసుకోవడం లేదంటూ  రెనగేడ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టువర్ట్ కొవంట్రీ తాజాగా స్పష్టం చేశారు. 2016-17 సీజన్ లో గేల్ తో ఒప్పందాన్ని కొనసాగించడం లేదని కొవంట్రీ పేర్కొన్నారు.

ఈ ఏడాది జనవరిలో జరిగిన బిగ్ బాష్ సందర్భంగా  ఓ టీవీ జర్నలిస్టుతో గేల్ అసభ్యకరంగా ప్రవర్తించడమే  ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ అంశంపై అప్పట్లోనే మండిపడ్డ ఆస్ట్రేలియా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు  గేల్ను బిగ్ బాష్లో ఆడకుండా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా,గత  ఏప్రిల్లో గేల్ అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. బిగ్ బాష్ లీగ్లో గేల్ చేసిన వ్యాఖ్యలతో సీఏకు ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేసింది.  వచ్చే సీజన్లో బిగ్ బాష్ లీగ్ లో గేల్ ఆడేందుకు ఎటువంటి అభ్యంతరాలూ లేవంటూ పేర్కొంది. ఫ్రాంచైజీల ఇష్ట ప్రకారమే గేల్ బిగ్ బాష్ లీగ్ లో పాల్గొనడం ఆధారపడుతుందని సీఏ పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలోనే  మెల్ బోర్న్  రెనగేడ్స్  గేల్ ను పక్కను పెట్టినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇటీవల ఇంగ్లండ్ మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా వ్యాఖ్యానించి సరికొత్త వివాదానికి తెరలేపాడు గేల్. కొన్ని రోజుల క్రితం బ్రిటిష్ దినపత్రిక 'ద టైమ్స్‌' మహిళా జర్నలిస్టు చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  నువ్వు థ్రిసమ్‌కు (ముగ్గురు కలిసి శృంగారానికి) పాల్పడ్డవా? అని వెకిలిగా అడిగాడు. ఈ నేపథ్యంలో  ఇంగ్లిష్ కౌంటీల్లో సోమరసెట్ తరపున ఆడే గేల్కు ఆ దేశంలో చిక్కులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు