‘చేజారిందనుకున్నాం.. కానీ, అలా జరగలేదు’

12 Jan, 2020 11:34 IST|Sakshi

సిడ్నీ : క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు ఫీల్డర్‌ మైదానంలో చురుగ్గా కదిలి అందివచ్చిన క్యాచ్‌ను ఒడిసి పట్టుకుంటేనే ఫలితం ఆశాజనకంగా ఉంటుంది. అయితే, ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో కొన్నిసార్లు బంతిని అంచనా వేయలేకపోవచ్చు. దాంతో అటు క్యాచ్‌, ఇటు మ్యాచ్‌ ప్రత్యర్థి వశం అయ్యే ప్రమాదం ఉంటుంది. లేదంటే పరుగులు సమర్పించుకోవచ్చు. ఇక ఆస్ట్రేలియాలో జరిగే ప్రతిష్టాత్మక బిగ్‌బాష్‌ లీగ్‌లో శనివారం అద్భుతమైన క్యాచ్‌ సన్నివేశమొకటి ఆవిష్కృతమైంది. సిడ్నీ థండర్‌, హోబర్ట్‌ హారికేన్స్‌ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో.. హొబర్ట్‌ ఆటగాడు నాథన్‌ ఎల్లిస్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టాడు.

సిడ్నీ థండర్‌ ఆటగాడు ఉస్మాన్‌ ఖవాజా ఆట 12వ ఓవర్‌లో డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశగా కొట్టిన భారీ షాట్‌ గాల్లోకి లేచి వేగంగా బౌండరీ లైన్‌ వైపు దూసుకొచ్చింది. బంతి క్యాచ్‌ పడుదామని నాథన్‌ ముందుకు కదిలాడు. కానీ, అతని అంచనా తప్పింది. బంతి తక్కువ ఎత్తులో అతని వైపు రాసాగింది. చాకచక్యంగా వ్యవహరించిన నాథన్‌.. మోకాళ్లపై కూర్చుని క్యాచ్‌ పట్టేందుకు యత్నించాడు. అయితే, అంచనాలు తలక్రిందులు చేస్తూ.. బంతి అతని పైనుంచి వెళ్లింది. వెంటనే అలర్టయిన నాథన్‌ మోకాళ్లపైనే కూర్చుని రెండు చేతులు పైకి చాచడం.. బంతి అతని చేతిలో పడటం చకచక జరిగిపోయాయి. దీంతో 35 పరుగులు చేసిన ఓపెనర్‌ ఖవాజా పెవిలియన్‌ చేరక తప్పలేదు. ఈ మ్యాచ్‌లో హోబర్ట్‌పై థండర్‌ విజయం సాధించింది. నాథన్‌ క్యాచ్‌ వీడియోపై సోషల్‌ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. చేజారిందనుకున్న క్యాచ్‌ను నాథన్‌ చక్కగా ఒడిసిపట్టాడని నెటిజన్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు