రషీద్‌ హ్యాట్రిక్‌.. కానీ బర్త్‌డే బాయ్‌దే గెలుపు

8 Jan, 2020 16:40 IST|Sakshi

అడిలైడ్‌: బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో బుధవారం రెండు వినూత్న ఘటనలు జరిగాయి. అడిలైడ్‌ స్ట్రైకర్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌, సిడ్నీ సిక్సర్స్‌ బౌలర్‌, బర్త్‌డే బాయ్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ల మధ్య ఆసక్తికర పోరు జరిగింది. అయితే ఈ పోరులో బర్త్‌డే బాయ్‌ హేజిల్‌ వుడ్‌ విజయం సాధించాడు. కాగా సిడ్నీ ఆల్‌రౌండర్‌ టామ్‌ కరన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. బీబీఎల్‌లో భాగంగా బుధవారం అడిలైడ్‌, సిడ్నీ జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అడిలైడ్‌కు టామ్‌ కరన్‌(4/22) చుక్కలు చూపించాడు. కరన్‌కు తోడు మిగతా సిడ్నీ బౌలర్లు సహకారం అందించడంతో అడిలైడ్‌ జట్టు 19.4 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీకి కూడా ఆశించిన ఆరంభం లభించలేదు. 

అడిలైడ్‌ బౌలర్‌ నెసెర్‌ ఆరంభంలోనే సిడ్నీ సిక్సర్స్‌ ఓపెనర్ల వికెట్లు పడగొట్టాడు. అయితే ఎట్టాగెట్టానో గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్న సిడ్నీ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ పనిపట్టాడు రషీద్‌ ఖాన్‌. వరుసగా జేమ్స్‌ విన్సే(27), జోర్డాన్‌ సిల్క్‌(16), జాక్‌ ఎడ్వర్డ్స్‌(0)లను ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. కాగా, బీబీఎల్‌లో రషీద్‌కు ఇది మూడోది కాగా, అడిలైడ్‌ స్ట్రైకర్‌ జట్టుకు మొదటిది. రషీద్‌ దెబ్బకు 97 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి సిడ్నీ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో టామ్‌ కరన్‌ ఈ సారి బ్యాట్‌తో జట్టును ఆదుకున్నాడు. అయితే అతడు కూడా 18 ఓవర్‌ చివరి బంతికి ఔటవ్వడంతో సిడ్నీ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. అంతేకాకుండా చివరి రెండో ఓవర్లలో సిడ్నీ సిక్సర్స్‌ జట్టుకు 12 పరుగులు అవసరం కాగా క్రీజులో టెయిలెండర్లు మాత్రమే ఉన్నారు. అయితే సిడిల్‌ వేసిన 19 ఓవర్‌లో హేజిల్‌ వుడ్‌ అనూహ్యంగా హ్యాట్రిక్‌ ఫోర్‌ కొట్టి సిడ్నీ జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో రషీద్‌, హేజిల్‌ వుడ్ పోరులో(హ్యాట్రిక్‌) బర్త్‌డే బాయే గెలిచాడాని కామెంటేటర్లు సరదాగా కామెంట్‌ చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్న టామ్‌ కరన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా