పరుగు కోసం తాపత్రయం.. తప్పిన ప్రమాదం

22 Jan, 2020 10:58 IST|Sakshi

మెల్‌బోర్న్‌: మిగతా ఆటలతో పోలిస్తే క్రికెట్‌లో కాస్త రిస్క్‌ తక్కువ అని కొందరి అభిప్రాయం. అయితే ఏ మాత్రం అదుపు తప్పిన, అలసత్వం ప్రదర్శించినా ఊహకు కూడా అందని పరిణామాలు చోటు చేసుకుంటాయి. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఫిలిప్‌ హ్యూస్ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. బిగ్‌బాష్‌లీగ్‌ (బీబీఎల్‌) భాగంగా మెల్‌బోర్న్‌ రెనిగెడ్స్‌ బ్యాట్స్‌మన్‌ సామ్‌ హార్పర్‌ పరుగు తీసే క్రమంలో బౌలర్‌ను ఢీ కొట్టి ఆస్పత్రిపాలయ్యాడు. అయితే ఈ ఘటన జరిగిన తీరు చూశాక సహచర ఆటగాళ్లతో పాటు మైదానంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 

బీబీఎల్‌లో భాగంగా మంగళవారం హార్బర్ట్‌ హరికేన్స్‌, మెల్‌బోర్న్‌ రెనిగెడ్స్‌ జట్ల మధ్య హోరాహోరు పోరు జరిగింది. అయితే మెల్‌బోర్న్‌ బ్యాటింగ్‌ సందర్భంగా హరికేన్స్‌ బౌలర్‌ నాథన్‌ ఎల్లిస్‌ వేసిన బంతిని బ్యాట్స్‌మన్‌ సామ్‌ హార్పర్‌ మిడాఫ్‌ మీదుగా ఆడి సింగిల్‌ తీసే ప్రయత్నం చేశాడు. అయితే మిడాఫ్‌లో ఉన్న ఫీల్డర్‌ బంతిని అందుకోవడాన్ని గమనించిన హార్పర్‌ ఎదురుగా ఉన్న బౌలర్‌ను చూసుకోకుండా పరిగెత్తాడు. అయితే బంతిని అందుకోవడానికి వికెట్ల దగ్గరే ఉన్న ఎల్లిస్‌ను హార్పర్‌ బలంగా ఢీ కొట్టి గాల్లొకి ఎగిరాడు. అయితే గాల్లోకి ఎగిరి కిందపడే సమయంలో హార్పర్‌ మెడ బలంగా మైదానాన్ని తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడు. డాక్టర్లు వచ్చి హార్పర్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. అయితే అతడికి మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు సూచించారు. దీంతో రిటైర్ట్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. 
 

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీబీఎల్‌ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అయింది. హార్పర్‌ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఆటగాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ రెనిగెడ్స్‌ 4 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం రెనిగేడ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. 

చదవండి: 
కాంబ్లికి సచిన్‌ సవాల్‌

స్టార్క్‌ను ట్రోల్‌ చేసిన భార్య

మరిన్ని వార్తలు