ఐపీఎల్‌ 2020: ముస్తాఫిజుర్‌కు లైన్‌ క్లియర్‌

6 Dec, 2019 13:22 IST|Sakshi

ఢాకా: గతేడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఆడటానికి తమ క్రికెట్‌ బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ టోర్నీకి దూరమైన బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌కు ఈసారి క్లియరెన్స్‌ లభించింది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నుంచి ముస్తాఫిజుర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ లభించడంతో ఈ సీజన్‌లో జరుగనున్న ఐపీఎల్‌ వేలానికి ముస్తాఫిజుర్‌ అందుబాటులో ఉండనున్నాడు.  దాంతో డిసెంబర్‌-19 వ తేదీన ఐపీఎల్‌  వేలంలో తన అదృష్టాన్ని ముస్తాఫిజుర్‌ పరీక్షించుకోనున్నాడు.

దీనిపై బీసీబీ క్రికెట్‌ ఆపరేషన్‌ చైర్మన్‌ అక్రమ్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ‘ ముస్తాఫిజుర్‌ను ఎక్కువగా క్రికెట్‌ ఆడనివ్వకుండా చేయడానికి కారణం అతను తరచు గాయాల బారిన పడటమే. ప్రధానంగా విదేశీ లీగ్‌ల్లో ఆడకుండా ముస్తాఫిజుర్‌ను అడ్డుకుంటూ వచ్చాం. ప్రస్తుతం ముస్తాఫిజుర్‌ ఎటువంటి సీరియస్‌ గాయాలు కాకుండా క్రికెట్‌ ఆడుతున్నాడు. అందుకోసమే ఐపీఎల్‌ ఆడటానికి అనుమతి ఇచ్చాం. అతని ఐపీఎల్‌ ప్రదర్శనతో తిరిగి గాడిలో పడతాడని ఆశిస్తున్నాం. అది మా జట్టుకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ముస్తాఫిజుర్‌ మాకు చాలా కీలకమైన బౌలర్‌. మళ్లీ సత్తాచాటుకుని పూర్వ వైభవాన్ని చాటుకుంటాడని అనుకుంటున్నాం’ అని అక్రమ్‌ ఖాన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఐపీఎల్‌–2020 కోసం జరిగే వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 971 మంది క్రికెటర్లు ముందుకు వచ్చారు. ఇందులో 713 మంది భారత ఆటగాళ్లు కాగా, 258 మంది విదేశీయులు. భారత క్రికెటర్లలో 19 మంది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా... 634 మంది ఎప్పుడూ టీమిండియా తరఫున ఆడలేదు. మరో 60 మంది కనీసం ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌ అయినా ఆడినవారున్నారు. అయితే ఈ 971 మంది నుంచి తాము కోరుకుంటున్న ఆటగాళ్ల పేర్లను ఎనిమిది ఫ్రాంచైజీలు డిసెంబర్‌ 9లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆ జాబితాలో ఉన్న వారికే వేలంలో చోటు దక్కుతుంది. ఐపీఎల్‌లో ప్రస్తుతం గరిష్టంగా 73 మందిని మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది. డిసెంబర్‌ 19న కోల్‌కతాలో వేలం నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు