బీసీబీకి తటస్థ వేదిక ఆప్షన్!

11 Jul, 2016 17:38 IST|Sakshi

ఢాకా: ఈ ఏడాది సెప్టెంబర్లో  ఇంగ్లండ్-బంగ్లాదేశ్ల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ను తటస్థ వేదికపై నిర్వహించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ఆ దేశంలో పర్యటించేందుకు ఇంగ్లండ్ సంకోచిస్తుంది.  ఈ క్రమంలో ఇరు దేశాల క్రికెట్ సిరీస్ను తటస్థ వేదికపై నిర్వహించాలనే  యోచనలో ఉన్నారు.  తటస్థ వేదిక అంశాన్ని ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీబీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. ఒకవేళ బంగ్లాతో సిరీస్ ఆడాలనుకుంటే తటస్థ వేదికే సబబని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు.

అయితే బంగ్లాదేశ్ తో సిరీస్ను తటస్థ వేదికపై నిర్వహించాలనే అంశంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదని బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నజాముద్దీన్ చౌదరి పేర్కొన్నారు. తమ దేశంలో ఇంగ్లండ్ పర్యటనకు ఇంకా చాలా సమయం ఉన్నందును అప్పటికీ పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందంటూ నజాముద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు.  జూలై నెల ఆరంభంలో బంగ్లాదేశ్లో ఉగ్రవాదలు మారణకాండకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇందులో దాదాపు 20 మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరగాల్సిన సిరీస్పై సందిగ్థత నెలకొంది.

మరిన్ని వార్తలు