‘మాకు ముందుగా ఏమీ తెలీదు’

31 Oct, 2019 04:34 IST|Sakshi

షకీబ్‌ ఘటనపై బంగ్లా బోర్డు వివరణ

ఢాకా: షకీబ్‌ అల్‌ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) రెండేళ్ల నిషేధం విధించడం వెనక బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) కుట్ర ఉన్నదని విమర్శలు వచ్చిన నేపథ్యంలో బీసీబీ వివరణ ఇచ్చింది. గత వారం ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లకు సంబంధించి షకీబ్‌ తిరుగుబాటు చేయగా, సమ్మె ముగిసిన తర్వాత కూడా ఆ విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. దాంతో షకీబ్‌ను బోర్డు కావాలనే ఇరికించిందని పలువురు విమర్శలకు దిగారు. ‘దీనిపై నేను స్పష్టత ఇవ్వదల్చుకున్నాను. ఫిక్సింగ్‌కు సంబంధించి జనవరి నుంచి సాగిన దర్యాప్తుతో నాకు గానీ మా బోర్డుకు కానీ ఎలాంటి సంబంధం లేదు.

స్వతంత్ర సంస్థ అయిన అవినీతి నిరోధక విభాగం స్వయంగా షకీబ్‌తో మాట్లాడింది. ఆటగాళ్ల సమ్మెకు సంబంధించి చర్చలు ముగిసిన తర్వాత రెండు, మూడు రోజుల క్రితం మాత్రమే అతను నాకు ఈ విషయం తెలియజేశాడు. ముందుగా చెప్పలేదని కోపం నాకూ ఉంది. కానీ అతను ఐసీసీకి తగిన విధంగా సహకరించాడు. అలాంటి కీలక ఆటగాడి సేవలు కోల్పోవడం దురదృష్టకరం’ అని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు షకీబ్‌ నిషేధంపై ఆగ్రహం చెందిన బంగ్లాదేశ్‌ అభిమానులు ఆ దేశంలో వేర్వేరు చోట్ల నిరసనలకు దిగారు.  

భారత్‌ చేరిన బంగ్లా జట్టు...
టి20 సిరీస్‌లో పాల్గొనే బంగ్లాదేశ్‌ జట్టు బుధవారం రాజధాని న్యూఢిల్లీకి చేరుకుంది. షకీబ్‌లాంటి ఆటగాడు లేని లోటు తీర్చలేనిదని, అయితే మరింత పట్టుదలగా ఆడి మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తామని జట్టు టి20 కెపె్టన్‌ మహ్ముదుల్లా అన్నాడు. ప్రస్తుతానికి ఒక ఆటగాడు గాయమై సిరీస్‌కు దూరమైతే ఎలా ఉంటుందో అదే తరహాలో షకీబ్‌ గురించి భావిస్తున్నట్లు అతను చెప్పాడు. భారత్‌పై తమ రికార్డు పేలవంగా ఉందని అంగీకరించిన మహ్ముదుల్లా... సంచలనం సృష్టించగల సత్తా బంగ్లా జట్టుకు ఉందని అభిప్రాయపడ్డాడు. నవంబర్‌ 3, 7, 10 తేదీల్లో భారత్, బంగ్లాదేశ్‌ మధ్య మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి.  

మరిన్ని వార్తలు