చీఫ్ సెలక్టర్‌గా ఎమ్మెస్కే

22 Sep, 2016 00:32 IST|Sakshi
చీఫ్ సెలక్టర్‌గా ఎమ్మెస్కే

ఐదుగురు సభ్యులతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ
 లోధా కమిటీ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిర్ణయం
 కార్యదర్శిగా షిర్కే ఏకగ్రీవ ఎన్నిక  


 ఆంధ్ర క్రికెట్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. భారత మాజీ క్రికెటర్, ఆంధ్రకు చెందిన మన్నవ శ్రీకాంత్ (ఎమ్మెస్కే) ప్రసాద్ భారత సెలక్షన్ కమిటీకి చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఏడాది క్రితం సెలక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్... ఈసారి అత్యున్నత పదవిని దక్కించుకున్నారు.   

  ముంబై: భారత క్రికెట్‌లో ఇది ఆశ్చర్యకర పరిణామం. లోధా కమిటీ ప్రతిపాదనలు అమలు చేయాల్సిన దశలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సమావేశంలో ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నారు. కేవలం ముగ్గురు సెలక్టర్లతోనే కమిటీని ఏర్పాటు చేయాలన్న లోధా కమిటీ ప్రతిపాదనను తుంగలో తొక్కుతూ గతంలో మాదిరిగానే ఐదుగురు సభ్యులతో సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఆంధ్రకు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వం వహిస్తారు. భారత్ తరఫున ప్రసాద్ 6 టెస్టులు, 17 వన్డేలు ఆడారు.
 
 గత కమిటీలో ఉన్న గగన్ ఖోడాను కూడా కొనసాగించారు. రాజస్తాన్‌కు చెందిన ఖోడా (సెంట్రల్ జోన్) ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. సెలక్షన్ కమిటీలోకి కొత్తగా దేవాంగ్ గాంధీ (ఈస్ట్ జోన్), జతిన్ పరాంజపే (వెస్ట్ జోన్), శరణ్‌దీప్ సింగ్ (నార్త్ జోన్)లను కూడా ఎంపిక చేశారు. ఇక జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా వెంకటేశ్ ప్రసాద్‌ను కొనసాగించారు. టెస్టు క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ముగ్గురు సభ్యులతో సెలక్షన్ కమిటీని ఎంపిక చేయాలనేది లోధా కమిటీ ప్రతిపాదన. కానీ బీసీసీఐ  పట్టించుకోలేదు. దీనిపై లోధా కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రరుుంచే ఆలోచనలో ఉంది.
 
 షిర్కే ఏకగ్రీవ ఎన్నిక: బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన 87వ వార్షిక సర్వసభ్య సమావేశంలో... అజయ్ షిర్కేను బోర్డు కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాస్తవానికి అనురాగ్ ఠాకూర్ అధ్యక్షుడు అయిన దగ్గరి నుంచి మహారాష్ర్టకు చెందిన షిర్కే ఈ బాధ్యతల్లో ఉన్నారు. అయితే అధికారికంగా ఎన్నిక లాంఛనాన్ని పూర్తి చేశారు. గత ఏడాది ఎన్నుకున్న కమిటీలను కూడా కొనసాగించారు. ఇందులో ఏవైనా ఖాళీలు ఏర్పడితే వాటిని పూరించే బాధ్యతను అధ్యక్ష, కార్యదర్శులకు అప్పగించారు. అలాగే బోర్డు అంబుడ్‌‌సమన్‌గా వ్యవహరిస్తున్న ఏపీ షా పదవీ కాలం పూర్తయినందున... కొత్త అంబుడ్‌‌సమన్‌ను కూడా ఠాకూర్, షిర్కే ఎంపిక చేస్తారు.
 
 ఠాకూర్ లేకపోతే పవార్: ఇక ఐసీసీ సమావేశాల్లో బీసీసీఐ ప్రతినిధిగా బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పాల్గొనాలని ఏజీఎంలో నిర్ణయించారు. ఇటీవల ఐసీసీలో మనోహర్ తీసుకుంటున్న భారత వ్యతిరేక నిర్ణయాలను ఆపాలంటే శ్రీనివాసన్‌ను ఐసీసీకి పంపాలని కొందరు సభ్యులు ప్రతిపాదించారు. అయితే ఠాకూర్ బృందం దీనిని తోసిపుచ్చింది. ఒకవేళ ఠాకూర్ అందుబాటులో లేకపోతే శరద్ పవార్ ఐసీసీ సమావేశాల్లో పాల్గొంటారు. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో మాత్రం బీసీసీఐకి షిర్కే ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే 30న బీసీసీఐ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. లోధా కమిటీ ప్రతిపాదనలపై ఆ సమావేశంలో నిర్ణయిస్తారు.
 
 ‘ఇది నాకు గొప్ప గౌరవం. 2017 చాంపియన్‌‌స ట్రోఫీతో పాటు 2019 ప్రపంచకప్ వరకూ ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో నాకు స్పష్టత ఉంది. మేం వీలైనంత ఎక్కువగా గతేడాది దేశవాళీ మ్యాచ్‌లు చూశాం. జింబాబ్వే, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ ఆటగాళ్లను పరిశీలించాం. సందీప్ పాటిల్ సారథ్యంలో గత కమిటీ బాగా పని చేసింది. అదే విజన్‌తో మేం కూడా ముందుకు వెళతాం’  
   - ఎమ్మెస్కే ప్రసాద్.
 
 ‘సెలక్టర్ల ఎంపిక ప్రక్రియను నేను, అధ్యక్షుడు ఠాకూర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ జోహ్రి కలిసి చూశాం. దరఖాస్తు చేసుకున్న వారందరితో మాట్లాడాం. గత కమిటీలో నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న వారి స్థానంలో కొత్త వారిని తీసుకున్నాం. కమిటీలో ఉన్న వారిలో సీనియర్ అయిన ఎమ్మెస్కేను చీఫ్‌గా ఎంపిక చేశాం’  
    - బోర్డు కార్యదర్శి షిర్కే
 

>
మరిన్ని వార్తలు