వన్డే సిరీస్‌ ముగిసింది 

14 Mar, 2020 02:19 IST|Sakshi
శుక్రవారం లక్నో విమానాశ్రయంలో మాస్క్‌లతో భారత కెప్టెన్‌ కోహ్లి, బ్యాట్స్‌మన్‌ లోకేశ్‌ రాహుల్‌

భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లు కొనసాగించరాదని నిర్ణయం

కరోనా నేపథ్యంలో సిరీస్‌ను మధ్యలోనే రద్దు చేసిన బీసీసీఐ  

ముంబై: ఐపీఎల్‌కు ముందే కోవిడ్‌–19 ప్రభావం భారత క్రికెట్‌ జట్టుపై పడింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా రేపు, బుధవారం జరగాల్సి ఉన్న రెండు మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ రెండు వన్డేలను ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని గురువారమే నిర్ణయం తీసుకున్న బోర్డు... ఇప్పుడు వాటిని పూర్తిగా నిర్వహించకపోవడమే మేలని భావించింది. ఇరు జట్లు శుక్రవారం లక్నో చేరుకున్న తర్వా త బీసీసీఐ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ‘ఐపీఎల్‌ ఎలాగూ వాయిదా పడింది. ప్రస్తుతం మన దేశంలో నెలకొన్న తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో వన్డే సిరీస్‌ కూడా రద్దు చేయడమే మంచిది.

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లు కూడా ఆడేందుకు ఇష్టపడటం లేదు. వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వీలైనంత తొందరగా స్వదేశం చేరుకోవాలని భావిస్తున్నారు’ అని బీసీసీఐ ఉన్నతాధికారులు వెల్లడించారు. అన్ని చక్కబడిన తర్వాత రాబోయే రోజుల్లో ఈ సిరీస్‌ను ఎప్పుడైనా మళ్లీ నిర్వహిస్తామని కూడా బోర్డు కార్యదర్శి జై షా పేర్కొన్నారు. వన్డే సిరీస్‌ రద్దుపై కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు స్పందిస్తూ... ‘ఆరోగ్య సమస్యలకంటే ఆర్థికపరంగా కలిగే నష్టం ఇప్పుడు పెద్దగా ముఖ్యం కాదు’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు