లిఖితపూర్వక హామీ తీసుకోండి

12 Jan, 2017 00:33 IST|Sakshi

బీసీసీఐ సీఈఓను కోరిన లోధా కమిటీ

న్యూఢిల్లీ: ఆయా రాష్ట్రాల్లో జరిగే క్రికెట్‌ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం కల్పించబోమని రాష్ట్ర సంఘాల నుంచి లిఖితపూర్వక హామీ తేవాలని లోధా కమిటీ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) రాహుల్‌ జోహ్రిని ఆదేశించింది. అనర్హత వేటుతో పదవిని  కోల్పోనున్న ఆయా సంఘాల ప్రతినిధులు మ్యాచ్‌ల నిర్వహణకు, నూతన కార్యవర్గానికి ఎలాంటి ఇబ్బందులు సృష్టించబోమని హామీ పత్రాన్ని తేవాలని లోధా కమిటీ స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు నియమించిన ఈ కమిటీ సభ్యులు ఆర్‌.ఎం.లోధా, జస్టిస్‌ అశోక్‌ భాన్, ఆర్‌.వి.రవీంద్రన్‌ బుధవారమిక్కడ సమావేశమై బీసీసీఐ సీఈఓకు ఈ మేరకు హామీ పత్రాన్ని సమర్పించాలని ఆదేశించారు. న్యాయస్థానాల పరిధిలో ఉన్న హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం, రాజస్తాన్‌ క్రికెట్‌ సంఘం వ్యవహారాల్లో కల్పించుకోబోమని లోధా కమిటీ చెప్పింది. క్రికెట్‌ బాగు కోసం ఈ కమిటీ తెచ్చిన సంస్కరణలు తప్పకుండా అమలయ్యేలా చూడాలని ఈ సందర్భంగా బోర్డు సీఈఓ రాహుల్‌ జోహ్రికి చెప్పింది.

మరిన్ని వార్తలు