భారత క్రికెటర్ల జీతాలు భారీగా పెంపు!

28 Feb, 2018 18:50 IST|Sakshi
విరాట్‌ కోహ్లి సేన (ఫైల్‌ ఫొటో)

త్వరలోనే శుభవార్త తెలపనున్న బీసీసీఐ

ఆర్థిక కమిటీ ఆమోదమే తరువాయి

మీడియాకు వెల్లడించిన ఓ బీసీసీఐ అధికారి

సాక్షి, స్పోర్ట్స్‌ : టీమిండియా క్రికెటర్ల పంట పండనుంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలోనే ఆటగాళ్లకు శుభవార్త తెలపనుంది. బీసీసీఐ బోర్డు పరిధిలో ఆడుతున్న వారందరి జీతాలు భారీగా పెరగనున్నాయి. భారత పురుషుల, మహిళల జట్టుతో పాటు దేశవాళి,  అండర్‌-19 క్రికెటర్ల జీతాలు పెరగనున్నాయని బీసీసీఐ అధికారి ఒకరు ఓ జాతీయ చానెల్‌కు తెలిపారు. దీనికి సంబందించిన ప్రక్రియ దాదాపు పూర్తైందని.. సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆ అధికారి వెల్లడించారు. 

ఇక భారత పురుషుల జట్టు శ్రీలంక పర్యటనకు ముందే సుమారు 25 మంది క్రికెటర్లను ఏ,బీ, సీ మూడు కేటగిరీలుగా విభజించి వార్షిక కాంట్రాక్టులు అమలు చేయనున్నారు. జీతాల పెంపునకు ఆర్థిక కమిటీ ఆమోదం తెలుపడమే తరువాయి ఐపీఎల్ కన్నా ముందే ఆటగాళ్లకు కాంట్రాక్టులను ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. ఏడాదికి గ్రేడ్-ఏ క్రికెటర్లకు దాదాపుగా రూ.12కోట్లు, బి-గ్రేడ్‌ రూ.8 కోట్లు, సీ-గ్రేడ్‌ నాలుగు కోట్లు ఇవ్వనున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆటగాళ్లకు ఏ స్థాయి గ్రేడ్ ఇవ్వాలనేదాన్ని నిర్ణయిస్తుంది. ఆటగాళ్ల జీతాలు పెంచాలని గతంలో కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ, కోచ్ రవిశాస్త్రిలు బీసీసీఐ,పాలకుల కమిటీతో చర్చించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్రేడ్‌ ఏ ఆటగాళ్లు రూ.2 కోట్లు, గ్రేడ్‌ బీ రూ.1 కోటి, గ్రేడ్‌ సీ ఆటగాళ్లకు రూ.50 లక్షల వార్షిక వేతనం పొందుతున్నారు.

మరిన్ని వార్తలు