కోహ్లి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌పై బీసీసీఐ స్పష్టత

29 Jul, 2019 11:37 IST|Sakshi

ముంబై: వెస్టిండీస్‌ పర్యటనకు భారత క్రికెట్‌ జట్టు బయల్దేరి ముందు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు డుమ్మా కొట్టనున్నాడనే వార్తలపై భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ(బీసీసీఐ) స్పందించింది. అందులో నిజం లేదంటూ స్పష్టం చేసింది. కచ్చితంగా కోహ్లి ప్రి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఉంటుందని పేర్కొంది. సోమవారం విండీస్‌ పర్యటనకు పయనం కానుందని,  దానిలో భాగంగా కోహ్లి మీడియాతో సమావేశమవుతాడని తెలిపింది. విండీస్‌ పర్యటనలో భాగంగా తొలి రెండు టీ20లను ఫ్లోరిడా వేదికగా భారత్‌ ఆడనుంది.  అక్కడ్నుంచి మిగతా ద్వైపాక్షిక సిరీస్‌ ఆడటానికి విండీస్‌ వెళ్లనుంది.

రోహిత్‌తో వివాదం వార్తల నేపథ్యంలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు దూరంగా ఉండాలని కోహ్లి నిర్ణయించుకున్నాడంటూ వార్తలు వచ్చాయి.  మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నలతో కొత్త వివాదం వస్తుందనే భావించే అసలు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కే హాజరు కాకూడదని కోహ్లి భావించినట్లు తెలిసింది. దీనిపై వివరణ ఇచ్చిన బీసీసీఐ.. ఎప్పటిలాగా కోహ్లి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు హాజరు అవుతాడని పేర్కొంది.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు తలెత్తాయని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.   ఈ వార్తలు తప్పని కూడా భారత క్రికెట్‌ కంట్రోల్‌(బీసీసీఐ) వర్గాలు పేర్కొన్నాయి.  ఇదంతా మీడియా సృష్టేనని భారత క్రికెట్‌ పరిపాలక కమిటీ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ కూడా స్పష్టం చేశారు. కాగా, కోహ్లి-రోహిత్‌ల మధ్య వర్గ పోరు నడుస్తోందనేది కొన్ని పరిణామాల్ని బట్టి నిజమేనని అనిపిస్తోంది. కోహ్లి, అనుష్క శర్మల ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్‌ అన్‌ఫాలో కావడం వివాదానికి మరింత వేడి రాజేసింది. ఒకవేళ వారి మధ్య విభేదాలు ఉంటే విండీస్‌ పర్యటనలో భారత జట్టు ఆటపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు