టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా

28 Mar, 2017 17:30 IST|Sakshi
టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా

ధర్మశాల: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ను 2-1తో నెగ్గిన టీమిండియాను అభినందిస్తూ భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్డేడియంలో జరిగిన చివరిదైన నాలుగో టెస్టులో అజింక్య రహానే నేతృత్వంలోని భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ భారత్ వశమైంది. ఈ సందర్భంగా బీసీసీఐ భారత ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నజరానా ప్రకటించింది. ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేకు రూ.25 లక్షల రివార్డు, ఇతరత్రా సిబ్బంది ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షలు అందజేయనున్నట్లు తెలిపింది.

ఈ సిరీస్ లో భాగంగా పుణెలో జరిగిన తొలి టెస్టులో భారత్ 333 పరుగుల తేడాతో ఓటమి పాలై తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో విజయాన్ని సాధించి సిరీస్ ను సమయం చేసింది టీమిండియా. రాంచీ టెస్టులో ఆసీస్ పోరాటం చేయడంతో మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ధర్మశాలలో జరిగిన నిర్ణయాత్మక నాలుగో టెస్టులో అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లోనూ సమష్టిగా రాణించి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత క్రికెట్ జట్టు సగర్వంగా ముద్దాడింది.

ఆసీస్ పై స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ విజయంతో 2016-17 సీజన్ ను నెంబర్ వన్ గా ముగించింది టీమిండియా. ఈ విజయానికి గుర్తుగా టీమిండియాలో ఉత్సాహం నింపేందుకు ఆటగాళ్లతో పాటు కోచ్, సిబ్బందికి బీసీసీఐ వారికి భారీ నజరానా ప్రకటించింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు