-

సాయుధ బలగాలకు  రూ. 20 కోట్ల విరాళం

17 Mar, 2019 01:48 IST|Sakshi

ఐపీఎల్‌ ప్రారంభం రోజు  అందజేయనున్న బీసీసీఐ  

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సాయుధ బలగాలకు రూ. 20 కోట్ల విరాళం అందజేసేందుకు సిద్ధమైంది. పుల్వామా ఘటనలో 40 మంది భారత సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వీరమరణం పొందారు. దీనిపై ఇప్పటికే క్రికెటర్లు స్పందించారు. ఆర్మీ క్యాప్‌లతో బరిలోకి దిగి తమ మ్యాచ్‌ పారితోషికాన్ని (రూ. కోటి పైచిలుకు) ఆర్మీ నిధికి పంపారు. మన సైనికుల మరణం వల్ల విషాదం నెలకొనడంతో ఐపీఎల్‌ ప్రారంభోత్సవ వేడుకల్ని రద్దు చేసిన బీసీసీఐ అదే రోజు రూ. 20 కోట్లను త్రివిధ దళాధిపతులకు అందజేయనుంది.
 

ఈ మేరకు అందుబాటులో ఉన్న ఉన్నతాధికారిని ఆహ్వానించి విరాళమిస్తామని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. మొదట బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా... సీఓఏ ముందు ఈ ప్రతిపాదన తెచ్చారు. రూ.5 కోట్ల సాయం అందించాలన్నారు. ఇది తదనంతరం రూ. 20 కోట్లకు పెంచారు. దేశం కోసం ప్రాణాలనే పణంగా పెట్టే సైనికులకు బోర్డు చేసేది కేవలం చిరుసాయమేనని ఖన్నా ఈ సందర్భంగా అన్నారు.

మరిన్ని వార్తలు