భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై వీడని ఉత్కంఠ

22 Feb, 2019 18:43 IST|Sakshi

ముంబై : ప్రపంచకప్‌లోని భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌పై ఇంకా ఉత్కంఠ వీడలేదు. పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడికి నిరసనగా ప్రపంచ కప్‌లో పాక్‌ మ్యాచ్‌ను భారత్‌ రద్దు చేసుకోవాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం బీసీసీఐ పాలక వర్గం సమావేశమై ఈ విషయంపై చర్చించింది. 

అయితే ఇంకా ఈ మ్యాచ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమావేశ అనంతరం పాలకుల కమిటీ ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. రెండు విషయాలను మాత్రం ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. ప్రపంచకప్‌లో తమ ఆటగాళ్లకు ఎక్కువ భద్రత కల్పించాలని, భవిష్యత్తులో క్రికెట్‌ ఆడే దేశాలతోసంబంధాలుంటాయని కానీ, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశంతో మాత్రం సంబంధాలను విరమించుకుంటామని ఐసీసీకి తెలియజేస్తామన్నారు.

ఇవే అంశాలను ప్రస్తావిస్తూ బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రీ ఐసీసీకి లేఖ రాశారు. పుల్వామా ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు వీర మరణం పొందారని, ఈ దాడిని పాక్‌ తప్పా క్రికెట్‌ ఆడే అన్ని దేశాలు ఖండించాయని పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రపంచకప్‌ టోర్నీలో తమ ఆటగాళ్ల, అభిమానుల, అధికారుల భద్రత విషయంలో ఆందోళన నెలకొందని, ఐసీసీ, ఈసీబీ పటిష్ట భద్రత కల్పిస్తారని బీసీసీఐ నమ్ముతున్నప్పటికి భద్రత విషయంలో ఆందోళన కలుగుతోందని జోహ్రీ లేఖలో ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే దేశంతో క్రికెట్‌ సంబంధాలు తెంచుకోవాలని బీసీసీఐ కోరుతుందన్నారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా