‘సుప్రీం’ అనుమతి లభించాకే!

2 Dec, 2019 03:56 IST|Sakshi

నిబంధనలు మార్చనున్న బీసీసీఐ

ఐసీసీ సమావేశానికి జై షా

ముగిసిన బోర్డు ఏజీఎం

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త కార్యవర్గం నిబంధనల మార్పు విషయంలో తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ అంశంపై మరికొంత కాలం వేచి చూడాలని బోర్డు నిర్ణయించింది. సౌరవ్‌ గంగూలీ అధ్యక్షతన ఆదివారం ఇక్కడ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగింది. బోర్డుకు అనుబంధంగా ఉన్న 38 అసోసియేషన్‌ల ప్రతినిధులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే సమావేశానికి ముందుగా అనుకున్నట్లు ఎజెండా విషయంలో కార్యవర్గం దూకుడుగా వెళ్లలేకపోయింది. ‘ఏదేమైనా చివరకు కోర్టే నిర్ణయించాలి’ అని సౌరవ్‌ గంగూలీ వ్యాఖ్యానించాడు.  

తీర్మానం పెట్టకుండానే...
స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతం బయటపడిన తర్వాతి పరిణామాల్లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు దాదాపు మూడేళ్ల క్రితం జస్టిస్‌ లోధా కమిటీ బోర్డు నిర్వహణ విషయంలో పలు నిబంధనలు రూపొందించింది. ప్రస్తుతం ఇవే అమల్లో ఉన్నాయి. వీటిని పూర్తిగా సమీక్షించి తమకు అనుకూలంగా మార్చుకోవాలని కొత్త కార్యవర్గం భావించింది. అయితే వీటి అమలుకు సుప్రీం కోర్టు అనుమతి తప్పనిసరి. తమ ఏజీఎంలో ఆమోద ముద్ర వేయించుకున్న అనంతరం దానినే సుప్రీం కోర్టుకు పంపి అనుమతి కోరాలని కూడా అనుకున్నారు. నిజానికి కొత్త నిబంధనల గురించి తీర్మానం పెడితే సహజంగానే ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఏజీఎంలో వాటికి ఆమోద ముద్ర పడిపోయేదే.

అయితే లోధా కమిటీ సిఫారసులకు సంబంధించిన అంశంపైనే ఈ నెల 3న (మంగళవారం) సుప్రీంలో వాదనలు కొనసాగనున్నాయి. ఈ దశలో కొత్త నిబంధనలు రూపొందిస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని సమావేశంలో పలు సూచనలు వచ్చాయి. దాంతో ప్రస్తుతానికి బోర్డు తుది నిర్ణయం తీసుకోలేదు. అసలు ఆ అంశంపై ఓటింగే జరగలేదని సమావేశంలో పాల్గొన్న ఒక ప్రతినిధి వెల్లడించారు. ముఖ్యంగా ఆఫీస్‌ బేరర్లుగా పని చేసినవారు కనీసం మూడేళ్ల విరామం ఇచి్చన తర్వాత మరో పదవికి అర్హులవుతారనే నిబంధనను వీలైనంత తొందరగా మార్చాలని గంగూలీ బృందం భావిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం గంగూలీతో పాటు కార్యదర్శి జై షా పదవీ కాలం 10 నెలలకే ముగియనుంది. దాంతో కొత్త నిబంధన అమల్లోకి వస్తే వీరు తమ పదవుల్లో 2024 వరకు కొనసాగేందుకు అవకాశం ఉంటుంది.  

సీఈఓ స్థానంలో కార్యదర్శి...
సుప్రీం కోర్టు అనుమతి లేకుండా బీసీసీఐ ఒక కీలక నిర్ణయం మాత్రం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశానికి బోర్డు తరఫున కార్యదర్శి జై షా హాజరవుతారని గంగూలీ వెల్లడించాడు. సీఓఏ జమానాలో ఈ సమావేశాలకు సీఈఓ రాహుల్‌ జోహ్రి హాజరయ్యేవారు. అంతకుముందు బోర్డు కార్యదర్శే వెళ్లడం సాంప్రదాయంగా ఉండేది. ఇప్పుడు మళ్లీ కార్యదర్శి వెళ్లాలనే ప్రతిపాదనకు ఏజీఎంలో అంతా అంగీకరించారు.  

ఎమ్మెస్కే పదవీ కాలం ముగిసింది!
బీసీసీఐ ఏజీఎంలో కొత్త సెలక్షన్‌ కమిటీ ఏర్పాటుపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సెలక్షన్‌ కమిటీ సభ్యులను కూడా సీఏఓనే ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఐదుగురు సభ్యుల కమిటీలో ఇద్దరి పదవీకాలం ముగిసిపోయింది కాబట్టి కొనసాగే ప్రశ్నే లేదని గంగూలీ స్పష్టం చేశాడు. ‘పదవీ కాలం ముగిసిపోయింది. అది దాటిన తర్వాత ఉండే అవకాశం ఎవరికీ లేదు. సెలక్టర్లు బాగా పని చేశారు’ అని సౌరవ్‌ కితాబిచ్చాడు. 2015లో సెలక్టర్లుగా ఎంపికైన ఎమ్మెస్కే ప్రసాద్, గగన్‌ ఖోడా వెంటనే తప్పుకోవాల్సి ఉంటుంది. 2016లో సెలక్టర్లుగా మారిన జతిన్‌ పరాంజపే, శరణ్‌దీప్‌ సింగ్, దేవాంగ్‌ గాంధీ పదవీ కాలం నిబంధన ప్రకారం మరో ఏడాది ఉంది. అయితే బీసీసీఐ అనుకుంటే అందరినీ తప్పించవచ్చు. 

వారు మళ్లీ రారు!
కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ కారణంగా క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)కి రాజీనామా చేసిన దిగ్గజ ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్, వీవీఎస్‌ లక్ష్మణ్‌ మళ్లీ ఇందులోకి అడుగు పెట్టరని గంగూలీ స్పష్టం చేశాడు. ‘సీఏసీలోకి మళ్లీ రావడానికి నన్ను సంప్రదించారనేది శుద్ధ అబద్ధం. అసలు వాళ్లు మళ్లీ ఇందులోకి రావాలనే అనుకోరు’ అని సౌరవ్‌ స్పష్టం చేశాడు. కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ నిబంధన కారణంగానే తాము సీఏసీని ఏర్పాటు చేయలేకపోతున్నామని, అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ డీకే జైన్‌ను శనివారం కలిసి దీనిపై మరింత స్పష్టత కోరామని అతను చెప్పాడు. 10 రోజుల్లో సీఏసీని ఏర్పాటు చేస్తామని సౌరవ్‌ తెలిపాడు.

ఆటగాళ్లు ఏం చేశారనేది ముఖ్యం!
దేశవాళీ లీగ్‌లలో ఫిక్సింగ్‌ను నిరోధించడంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని గంగూలీ చెప్పాడు. ఇటీవల కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌లో వెలుగులోకి వచి్చన ఫిక్సింగ్‌ వివాదంపై అతను స్పందించాడు. గతంలో తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లోనూ ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. ‘ఎవరూ ఇలాంటివి జరగాలని కోరుకోరు. తమిళనాడు లీగ్‌లోంచి రెండు జట్లను తొలగించి చర్య తీసుకున్నాం. కర్ణాటక లీగ్‌ను ప్రస్తుతానికి నిలిపేశాం. మా అవినీతి నిరోధక విభాగాన్ని మరింత పటిష్టపరచాల్సిన అవసరం ఉంది.

అయితే ఫిక్సింగ్‌ కోసం ఆటగాళ్లను సంప్రదించినంత మాత్రాన టోరీ్నలను రద్దు చేయలేం’ అని అతను స్పష్టం చేశాడు. అయితే క్రికెటర్లు బాధ్యతగా వ్యవహరించడం ముఖ్యమని గంగూలీ సూచించాడు. ‘ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కూడా ఒక ఆటగాడిని ఫిక్సింగ్‌ కోసం కొందరు ప్రోత్సహించినట్లుగా తెలిసింది. అలా వారు ప్రయతి్నంచడాన్ని మనం ఏమీ చేయలేం. కానీ సంప్రదించిన తర్వాత క్రికెటర్లు ఏం చేస్తారనేదే ముఖ్యం. సదరు ఆటగాడు వెంటనే బీసీసీఐకి సమాచారం అందించాడు’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.   

మరిన్ని వార్తలు