బీసీసీఐ ఎన్నికలు ఏకగ్రీవమే!

15 Oct, 2019 04:27 IST|Sakshi
ముంబైలో గంగూలీతో ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రా రెడ్డి, కోశాధికారి గోపీనాథ్‌ రెడ్డి

ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్‌ 

23న ఏజీఎంలో అధికారిక ప్రకటన  

ముంబై: సుదీర్ఘ విరామం తర్వాత బీసీసీఐలో జరగబోతున్న ఎన్నికలు పూర్తిగా ఏకగ్రీవం కాబోతున్నాయి. ఈ నెల 23న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహిస్తారు. అదే రోజు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అపెక్స్‌ కౌన్సిల్‌లోని ఎనిమిది స్థానాలకు చివరి రోజు సోమవారం ఎనిమిది మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పోటీ లేకుండా వీరందరూ ఎన్నిక కావడం ఖాయమైపోయింది. అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శిగా జై షా ఎన్నిక కానున్నారు. 23న వీరంతా అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తారు.  

అట్టహాసంగా...
చివరి రోజైన సోమ వారమే గంగూలీ, జై షా తమ నామినేషన్లు దాఖలు చేశారు. గంగూలీ వెంట బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్, మాజీ కార్యదర్శి నిరంజన్‌ షాతో పాటు రాజీవ్‌ శుక్లా కూడా ఉన్నారు. అయితే గంగూలీ వెళ్లిన సమయంలో ఎన్నికల అధికారి ఎన్‌.గోపాలస్వామి అక్కడ లేరు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన రాకపోవడంతో సౌరవ్‌ అక్కడి అధికారులకు తమ నామినేషన్‌ పత్రాలు అందించి వెనుదిరిగారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ పేరును ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు శరత్‌ చంద్రారెడ్డి ప్రతిపాదించారు. ఈ మేరకు నామినేషన్‌ పత్రంలో ఆయన సంతకం చేశారు. ఏసీఏ కోశాధికారి గోపీనాథ్‌ రెడ్డి, భారత మాజీ క్రికెటర్‌ వేణుగోపాలరావు కూడా వీరి వెంట ఉన్నారు.  

సౌరవ్‌ గంగూలీ (అధ్యక్షుడు): భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌. కెరీర్‌లో 113 టెస్టులు, 311 వన్డేలు ఆడిన అనుభవం. ప్రస్తుతం బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

మహిమ్‌ వర్మ (ఉపాధ్యక్షుడు): ఉత్తరాఖండ్‌ క్రికెట్‌ సంఘం కార్యదర్శి.

జయేష్‌ జార్జ్‌ (సంయుక్త కార్యదర్శి): కేరళ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు. ఖైరుల్‌ జమీల్‌ మజుందార్‌ (గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు); ప్రభ్‌జోత్‌ సింగ్‌ భాటియా (కౌన్సిలర్‌).  

బ్రిజేశ్‌ పటేల్‌ (ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు): మాజీ క్రికెటర్‌. భారత్‌ తరఫున 21 టెస్టులు, 10 వన్డేలు ఆడారు. కర్ణాటక సంఘం నుంచి ప్రాతినిధ్యం.

అరుణ్‌ సింగ్‌ ధుమాల్‌ (కోశాధికారి): కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బోర్డు మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు. హిమాచల్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌ కుమార్‌ ధుమాల్‌ కుమారుడు. హిమాచల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు.  

జై షా (కార్యదర్శి): కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుమారుడు, వ్యాపారవేత్త. ఇటీవలి వరకు గుజరాత్‌ క్రికెట్‌ సంఘం సంయుక్త కార్యదర్శిగా ఉన్నాడు.
 

మరిన్ని వార్తలు