ఐపీఎల్‌పై బీసీసీఐ ప్లాన్‌-బి ఇదేనా?

20 Mar, 2020 15:59 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ అదుపులోకి వస్తే రాబోవు రోజుల్లో ఈ సీజన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) నిర్వహణకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందనేది ఆసక్తిగా మారింది.  కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ను వచ్చే నెల 15 వరకు బీసీసీఐ వాయిదా వేసింది. కానీ, అప్పుడైనా జరుగుతుందనే నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో ప్లాన్‌ ‘బి’ని బోర్డు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. జూలై-సెప్టెంబరు మధ్య నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై బీసీసీఐ సమాలోచన చేస్తోందని తెలిసింది. ఐసీసీ భవిష్యత్‌ టూర్‌ షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబరులో ఆసియా కప్‌ ఉంటుంది. అదే సమయంలో ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌ల సిరీస్‌ ఉంది. దీంతోపాటు జూన్‌-జూలై మధ్య ‘ద హండ్రెడ్‌’ సిరీస్‌ను నిర్వహించడానికి ఇంగ్లండ్‌ బోర్డు ప్లాన్‌ చేస్తోంది. ఇంగ్లండ్‌, పాక్‌ను పక్కన పెడితే ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ జట్లకు ముందుగా నిర్ణయించిన సిరీస్‌లు ఏమీ లేవు. (ఇది ధోని రీఎంట్రీకి సంకేతమా?)

సెప్టెంబరులో ఆసియా కప్‌ను మినహాయిస్తే.. ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్‌ వరకు ఒక్క శ్రీలంకతో మాత్రమే భారత్‌ తలపడనుంది. దీంతో ఆ షెడ్యూల్‌ను కుదించి ఐపీఎల్‌ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై బోర్డు కసరత్తులు చేస్తోంది. ‘ఐపీఎల్‌-2009 సీజన్‌ను 37 రోజులపాటు దక్షిణాఫ్రికాలో నిర్వహించాం. ఇప్పుడు కూడా అలాంటి అవకాశం ఉంటే కొన్ని మ్యాచ్‌లు భారత్‌లో కొన్ని విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉంది. మొత్తం లీగ్‌ను విదేశాలకు తరలించాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. కాకపోతే అప్పటికి కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉంటుందనే దానిపై ఆధారపడి ఉంటుందిం. ఒకవేళ తటస్థ వేదికగా ఏదొక దేశాన్ని ఎంచుకున్నా అక్కడ కరోనా ప్రభావం అసలు ఏమీ లేకుండా ఉండి, భారత్‌లో కూడా పూర్తిగా నియంత్రణలోకి వస్తేనే సాధ్యమవుతుంది. ఈ ప్లాన్‌-బి అనేది కరోనా తీవ్రతపైనే ఆధారపడి ఉంది.  ఈ క‍్రమంలో పలువురు విదేశీ క్రికెటర్లు దూరమైనా ఐపీఎల్‌ నిర్వహించాలనే గట్టిపట్టుదలతో బీసీసీఐ ఉన్నట్లు కనబడుతోంది. (ధోని భవితవ్యంపై గావస్కర్‌ స్పందన..)

మరిన్ని వార్తలు