క్రికెటర్ల ‘ఫీజు’ చెల్లింపుకు ఆమోదం

22 Jun, 2018 16:17 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్‌ ఫీజులకు సంబంధించి ఎట్టకేలకు ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన  బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో(ఎస్‌జీఎమ్‌) క్రికెటర్ల కాంట్రాక్ట్‌ ఫీజుల చెల్లింపుపై నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే వార్షిక ఫీజుల్ని పెంచినప్పటికీ బోర్డు నుంచి తుది ఆమోదం దక్కకపోవడంతో క్రికెటర్లకు పెంచిన జీతాలను పెండింగ్‌లో పెట్టారు.  కాగా, ఈరోజు అత్యవసరంగా బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి నేతృత్వంలోని  సమావేశమైన ఎస్‌జీఎమ్‌..  క్రికెటర్ల కాంట్రాక్ట్‌ ఫీజులకు చెల్లించేందుకు ఆమోదం ముద్రవేసింది. మరొకవైపు ఎస్‌జీఎమ్‌లో చర్చకు వచ్చిన అన్ని ప్రతిపాదనలకు జనరల్‌ బాడీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

వార్షిక కాంట్రాక్ట్‌ ప్రకారం ఏ+ కేటగిరీ ఆటగాళ్లకు రూ. 7 కోట్లు చొప్పున దక్కనుండగా, ఏ కేటగిరీలో ఉన్న క్రికెటర్లకు రూ. 5 కోట్లు పొందనున్నారు. ఇక బీ కేటగిరీలో ఉన్న వారికి రూ. 3 కోట్లు, సీ కేటగిరీలో క్రికెటర్లకు రూ. 1 కోటి చొప్పన దక్కనున్నాయి. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనల్లో భాగంగా ఈరోజు రాత్రి భారత క్రికెటర్లు బయల్దేరుతున్న సమయంలో కాంట్రాక్ట్‌ వార్షిక ఫీజులపై ఆమోద ముద్ర పడటం విశేషం.

మరిన్ని వార్తలు