సౌరభ్ గంగూలీకి కీలక బాధ్యతలు

20 Jul, 2015 16:42 IST|Sakshi
సౌరభ్ గంగూలీకి కీలక బాధ్యతలు

ముంబై: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసేందుకు బీసీసీఐ నలుగురు సభ్యులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, అనిరుధ్ చౌదరి సభ్యులుగా ఉన్నారు. రాజీవ్ శుక్లా సారథ్యంలో ఈ గ్రూపు పనిచేస్తుంది. శుక్లా బృందం లోధా కమిటీ తీర్పును పూర్తిగా చదివి, తగిన ప్రతిపాదనలతో నివేదిక సమర్పిస్తుంది.

స్పాట్ ఫిక్సింగ్ కేసులో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అల్లుడు గురునాథన్ మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహయజమాని రాజ్కుంద్రాలను లోధా కమిటీ దోషులుగా ప్రకటిస్తూ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక చెన్నై, రాజస్థాన్లపై రెండేళ్ల కాలం పాటు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో నిషేధిత జట్ల స్థానాల్లో కొత్తవాటిని తీసుకోవడం, ఈ జట్ల ఆటగాళ్లకు అవకాశం కల్పించడం వంటి అంశాలపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. శుక్లా కమిటీ ఇచ్చే నివేదికను బట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే అవకాశముంది.

మరిన్ని వార్తలు