చైనా ‘ఆట’లు ఆపతరమా..!

26 Jun, 2020 02:01 IST|Sakshi

స్పాన్సర్లుగా ఆ దేశపు కంపెనీలు

ఎక్విప్‌మెంట్, కిట్స్‌ అక్కడివే

బాయ్‌కాట్‌ చేయడం సులువు కాదు 

ఐపీఎల్‌తో చైనా కంపెనీ ‘వివో’ ఒప్పందాన్ని సమీక్షిస్తామంటూ బీసీసీఐ ప్రత్యేక సమావేశానికి సిద్ధమైంది. ఆ స్పాన్సర్‌షిప్‌ విలువ  అక్షరాలా రూ. 2,199 కోట్లు!... అవసరమైతే మేం కూడా చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తాం అంటూ భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) కూడా చెబుతోంది. వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య అయితే ఇప్పటికే చైనా ఎక్విప్‌మెంట్‌ను పక్కన పెట్టేసినట్లు ప్రకటించేసింది. సరిహద్దు వివాదం నేపథ్యంలో సహజంగానే మన క్రీడా సంఘాల్లో తమ వైపునుంచి దేశభక్తిని ప్రదర్శించేందుకు ఒకరితో మరొకరు పోటీ పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంనుంచి అధికారికంగా నిషేధం లేకుండా ఇలాంటివి అసలు సాధ్యమేనా... భారత క్రీడా రంగానికి గత కొన్నేళ్లలో చైనాతో ముడిపడిపోయిన బంధాన్ని చూస్తే ‘బాయ్‌కాట్‌’కు సాహసించడం అంత సులువు కాదు.

కేంద్ర వాణిజ్య శాఖ ఎగుమతులు, దిగుమతుల డేటా బ్యాంక్‌ ప్రకారం 2019 ఏప్రిల్‌నుంచి 2020 ఫిబ్రవరి వరకు భారతదేశంలో ‘జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, టేబుల్‌ టెన్నిస్, ఇతర అవుట్‌డోర్‌ క్రీడలు సహా’ సుమారు రూ. 919 కోట్ల క్రీడా పరికరాలు చైనానుంచి దిగుమతి అయ్యాయి. మొత్తంగా ఆ సమయంలో మనం తెప్పించుకున్న క్రీడా సామగ్రిలో 65 శాతం చైనానుంచే వచ్చింది. ఇంకా చెప్పాలంటే గత ఐదేళ్లలో భారత స్పోర్ట్స్‌ మార్కెట్‌లోకి చైనా దిగుమతుల విలువ ఏకంగా 80 శాతం పెరిగింది. ముఖ్యంగా బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫిట్‌నెస్‌ ఎక్విప్‌మెంట్‌లలో సింహభాగం చైనాదే.

ఇటీవల బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్‌ కూడా ఆ దేశంనుంచే వస్తున్నాయి. ముడి సరుకు మాత్రమే కాకుండా పూర్తయిన క్రీడా సామగ్రి కూడా చైనాదే. ప్రస్తుతం భారత క్రీడల్లో చైనా వస్తువుల ఆధిపత్యం ఏమిటో ఇది చూపిస్తోంది. పుణేకు చెందిన ఒక డిస్ట్రిబ్యూటర్‌ దీనిపై మాట్లాడుతూ ...‘చైనాకు చెందిన తైషన్‌ అనే కంపెనీనుంచి మన దేశానికి జిమ్నాస్టిక్స్‌ ఎక్విప్‌మెంట్‌ వస్తుంది. అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌ సమాఖ్య గుర్తించిన ప్రమాణాలను పాటిస్తూ రూ. 1 కోటికి అది ఒక సెట్‌ను అందిస్తుంది. అదే జర్మనీనో, ఫ్రెంచో అయితే కనీసం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. దానిని ఎవరు భరిస్తారు’ అనడం వాస్తవ స్థితికి అద్దం పడుతోంది.

లీ–నింగ్‌ జోరు...
భారత్‌కు సంబంధించి క్రికెటేతర క్రీడల్లో ఇప్పుడు చైనాకు చెందిన లీ–నింగ్‌దే హవా. మాజీ జిమ్నాస్ట్, 1984 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో 6 పతకాలు సాధించిన ఆ దేశపు దిగ్గజం లీ–నింగ్‌కు చెందిన ఈ కంపెనీ ఒక్కసారిగా దూసుకొచ్చింది. సొంత దేశం తర్వాత వారికి అది పెద్ద మార్కెట్‌ భారత్‌లో ఉంది. స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్లు పీవీ సింధుతో నాలుగేళ్లకు రూ. 48 కోట్లు, కిడాంబి శ్రీకాంత్‌తో రూ. 35 కోట్ల ఒప్పందాలు చేసుకోవడంతో పాటు ఇతర యువ షట్లర్లను కూడా లీ–నింగ్‌తో తమతో చేర్చుకుంది. భారత బ్యాడ్మింటన్‌పై తమ పైచేయి సాధించేందుకు సిద్ధమైంది. ఇదే క్రమంలో భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ)కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఏడాదికి వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ వరకు అది అమల్లో ఉంటుంది.

ప్రపంచపు అతి పెద్ద మెగా ఈవెంట్లో భారత అథ్లెట్లంతా లీ–నింగ్‌ లోగో ముద్రించిన దుస్తులతోనే పోటీ పడాల్సి ఉంటుంది. మేం కూడా సమీక్షిస్తాŠం అంటూ బయటకు చెబుతున్నా అది సాధ్యం కాదనేది వారికీ తెలుసు. ‘క్రికెటేతర క్రీడలకు స్పాన్సర్లు దొరకడం చాలా కష్టం. లీ–నింగ్‌ ఎక్కువ మొత్తానికి బిడ్‌ వేయడంతో వారితో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రభుత్వం కచ్చితమైన మార్గనిర్దేశకాలు జారీ చేస్తే ఏమో గానీ ఒలింపిక్స్‌కు ముందు వారితో ఒప్పందం రద్దు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ అలా చేస్తే ఒప్పంద ఉల్లంఘన కింద ఇవ్వాల్సిన నష్టపరిహారం తట్టుకోలేనంతగా ఉంటుంది’ అని ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ మెహతా కుండ బద్దలు కొట్టారు.

అడుగడుగునా చైనా యువాన్‌లే...  
మొబైల్స్‌ ఉత్పత్తుల చైనా కంపెనీ ‘వివో’ ఐపీఎల్‌ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఏడాదికి రూ. 440 కోట్ల భారీ ఒప్పందంలో బీసీసీఐపై కనకవర్షం కురిసింది. అది అంతకు ముందుకంటే 554 శాతం ఎక్కువ! ప్రొ కబడ్డీ లీగ్‌కు కూడా రూ. 300 కోట్ల విలువతో (ఐదేళ్లకు) వివోనే స్పాన్సర్‌. 2017లో టీమిండియా ప్రధాన స్పాన్సర్‌షిప్‌ కోసం మరో చైనా కంపెనీ ‘ఒప్పో’ రూ. 1079 కోట్లు చెల్లించింది. ఒప్పో అనూహ్యంగా తప్పుకున్న తర్వాత ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ కంపెనీ ‘బైజూస్‌’ ఇప్పుడు కోహ్లి సేనకు ప్రధాన స్పాన్సర్‌గా ఉంది. బైజూస్‌లో కూడా చైనా కంపెనీ ‘టెన్సెంట్‌’ పెట్టుబడులు ఉన్నాయి.

బీసీసీఐతో స్పాన్సర్లుగా అనుబంధం కొనసాగిస్తున్నవాటిలో చైనాతో సంబంధం, నేపథ్యం ఉన్న పేటీఎం, డ్రీమ్‌ 11, స్విగ్గీ, మేక్‌ మై ట్రిప్‌...ఇలా ఈ జాబితా పెద్దదే. ఇలాంటి స్థితిలో భారత కంపెనీలు ముందుకొచ్చి క్రీడా సంఘాలు ఆశించిన మొత్తానికి కోట్లాది రూపాయల స్పాన్సర్‌షిప్‌ ఇవ్వడం దాదాపుగా అసాధ్యం. ‘ఎక్కడో ఒక చోట పెట్టక తప్పదు కాబట్టి ఆయా సంస్థల నేపథ్యం ఏ దేశందైనా ఉండవచ్చు. కానీ ఇవన్నీ మల్టీనేషనల్‌ కంపెనీలు. వాటికి జాతీయత ఆపాదించడం సరైంది కాదు’ అంటూ ప్రముఖ స్పోర్ట్స్‌ లాయర్‌ నందన్‌ కామన్‌ చేసిన వ్యాఖ్యను చూస్తే తాజా పరిస్థితుల్లో చైనా లేకుండా మన ఆటలు 
కష్టమేమో!  

మరిన్ని వార్తలు