అంతా మా ఇష్టం

17 Dec, 2015 23:48 IST|Sakshi
అంతా మా ఇష్టం

 

 ►    వివాదాస్పదంగా బీసీసీఐ పెద్దల చర్యలు
 ►   రోజుకో మాట మాట్లాడుతున్న అనురాగ్
 ►  కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్‌కు మనోహర్ కొత్త భాష్యం

బీసీసీఐ నుంచి శ్రీనివాసన్‌ను తప్పించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఏకమైన శక్తులన్నీ రెండు నెలల్లోనే తామేంటో ప్రపంచానికి చూపిస్తున్నాయి. అధికారం చేతిలో ఉంటే ఎవరైనా ‘ఒకే పని’ చేస్తారని అధ్యక్షుడు శశాంక్ మనోహర్, కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మరోసారి నిరూపించారు. ప్రపంచకప్ కోసం వేదికల ఎంపికలో సొంత నగరాలకు పెద్ద పీట వేయడంతో పాటు... వీళ్లిద్దరి వ్యవహార శైలి భారత క్రికెట్‌కు ఆర్థికంగా కూడా నష్టం చేసేలా ఉంది. బోర్డులోని చాలామంది సభ్యులకు శ్రీనివాసన్ హయాంలో తప్పులుగా కనిపించినవి... ఇప్పుడు ఒప్పులుగా మారిపోయాయి.
 

 
 సాక్షి క్రీడావిభాగం
 అనురాగ్ ఠాకూర్ మార్చిలో బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికైన దగ్గరి నుంచి ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ వచ్చారు. అంతకుముందు శ్రీని హయాంలో బోర్డు సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన ఠాకూర్... ఆయనను తప్పించడంలో కీలక పాత్ర పోషించారు. శ్రీనివాసన్ పదవిలో ఉన్నంతకాలం మౌనంగా ఉన్నా... ఈ ఏడాది బోర్డు ఏజీఎం జరిగే సమయానికి మాత్రం ఆయన అన్ని శక్తులనూ ఏకం చేయడంలో విజయం సాధించారు. శ్రీనివాసన్ అంటే పడని శశాంక్ మనోహర్‌ను తెరమీదకు తీసుకొచ్చి బోర్డు అధ్యక్షుడిని చేయగలిగారు. ఇక మనోహర్ కూడా తాను వచ్చిన దగ్గరినుంచి ఏదో భిన్నంగా చేయబోతున్నట్లు పదే పదే చెబుతున్నారు.
 
 గతంలో శ్రీనివాసన్ చేసింది చెడు... నేను చేయబోయేది మంచి అనే భావన తేవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగా ఐసీసీలో మార్పులు తెస్తామనే ప్రకటన చేశారు. నిజానికి శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో అనేక సంస్కరణలు తెచ్చారు. ఇందులో భాగంగా ఆదాయం ఎక్కువ ఇచ్చే భారత్‌కు ఎక్కువ వాటా రావాలని డిమాండ్ చేసి... ఐసీసీ నుంచి భారత్‌కు వచ్చే ఆదాయాన్ని పెంచారు. ఇప్పుడు మనోహర్ వచ్చి దానిని తప్పు పడుతున్నారు. దీనివల్ల ఇతర ఐసీసీ సభ్య దేశాల్లో తను మంచివాడనే పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నారు. కానీ దీనివల్ల బీసీసీఐ ఆదాయానికి గండిపడుతుందనే అంశాన్ని మరచిపోతున్నారు.
 
 ప్రశ్న నాదే... సమాధానం నాదే...
 కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్‌కు మనోహర్ కొత్త భాష్యం చెప్పారు. క్రికెట్ నుంచి ఆదాయం పొందేవారు క్రికెట్ పరిపాలనలో ఉండటం తప్పు అని ఆయన అంటున్నారు. కానీ ఒకే వ్యక్తి మూడు రకాల హోదాల్లో నిర్ణయాలు తీసుకోవడం కాన్‌ఫ్లిక్ట్ కాదా? ప్రస్తుతం మనోహర్ ఐసీసీ చైర్మన్, బీసీసీఐ అధ్యక్షుడు, విదర్భ క్రికెట్ సంఘం కో ఆప్టెడ్ సభ్యుడు. అలాగే విదర్భ సంఘంలో ఆయన కుమారుడు అద్వైత్ మనోహర్ ఉపాధ్యక్షుడు. తాజాగా దక్షిణాఫ్రికా, భారత్‌ల మధ్య నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టెస్టులో పిచ్ బాగోలేదని మ్యాచ్ రిఫరీ ఐసీసీకి ఫిర్యాదు చేశారు.
 
  చైర్మన్ హోదాలో మనోహర్ బీసీసీఐని వివరణ కోరారు. ఇక్కడ బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో విదర్భ సంఘానికి ఆ లేఖను పంపారు. దీనికి విదర్భ తరఫున సమాధానం ఇచ్చిన కమిటీలో ఆయన సభ్యుడు. ఆ సమాధానాన్ని తిరిగి బోర్డు అధ్యక్షుడి హోదాలో చదివి ఐసీసీకి పంపుతారు. అక్కడ నిర్ణయం కూడా ఆయనదే. అంటే ఒక ప్రశ్నకు ప్రశ్న, సమాధానం కూడా ఆయనే ఇస్తారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలో ఆయనే చెప్పాలి.
 
 తేనెతుట్టెను కదిపారు
 ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికయ్యే సమయంలో శ్రీనివాసన్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఓ ఒప్పందం చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ఇరు దేశాల మధ్య సరిహద్దులో పరిస్థితి బాగోలేనందున శ్రీనివాసన్ సిరీస్‌కు సుముఖత చూపలేదు. ఆ సమయంలో అనురాగ్ ఠాకూర్ కూడా ఓ ట్వీట్ చేశారు. ‘సరిహద్దులో మా మీద దాడులు చేస్తుంటే మేం క్రికెట్ ఆడాలా?’ అంటూ విరుచుకుపడ్డారు.
 
  ఆ ట్వీట్ తర్వాత నెల రోజులకు బోర్డు అధ్యక్షుడిగా మనోహర్ వచ్చారు. రాగానే మనోహర్ పాక్‌తో సిరీస్ అనే తేనెతుట్టెను కదిల్చారు. చర్చలకు రావాలంటూ పాక్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్‌ను పిలిచారు. అది కూడా పోయి పోయి ముంబైకి రమ్మన్నారు. వాస్తవానికి ముంబైలో ఉండే పరిస్థితులు మహారాష్ట్ర వాసి అయిన మనోహర్‌కు బాగా తెలుసు. సహజంగానే ఖాన్ రాకను వ్యతిరేకిస్తూ ముంబైలో ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో మనోహర్ కోరుకున్న ప్రచారం లభించింది.  ఈ సమయంలో ఠాకూర్ తన పాత వైఖరికి భిన్నంగా మాట్లాడారు. ‘భారత్, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల పునరుద్ధరణ కోసం కృషి చేయాల్సిన బాధ్యత నాది’ అన్నారు. ఈ సందర్భంలో ఆయనకు సరిహద్దు గుర్తుకు రాలేదు. ఎలాగూ భారత ప్రభుత్వం ఈ సిరీస్‌కు అనుమతి ఇచ్చే అవకాశాలు తక్కువ. అయినా మనోహర్, ఠాకూర్ పదే పదే ఈ అంశం గురించి మాట్లాడుతూ వచ్చారు.
 
 ఆ పార్టీ ఎలా ఇచ్చారు?
 ఢిల్లీలో దక్షిణాఫ్రికాతో నాలుగో టెస్టు సందర్భంగా మ్యాచ్ నాలుగో రోజు రాత్రి బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తన నివాసరంలో భారత క్రికెటర్లకు పార్టీ ఇచ్చారు. నిజానికి మ్యాచ్‌ల మధ్యలో ఇలాంటి పార్టీలు నిర్వహించడం నిబంధనలకు వ్యతిరేకం. మ్యాచ్‌కు ముందు, తర్వాత పార్టీలు ఇవ్వడం సహజం. కానీ మ్యాచ్‌ల మధ్యలో ఇలాంటివి ఏర్పాటు చేయడం వల్ల కొత్తవాళ్లని క్రికెటర్లు కలిసే అవకాశం ఉంటుంది. ఇందులో బుకీలు ఉండొచ్చు... ఇంకెవరైనా ఉండొచ్చు. అందుకే వీటిని నియంత్రిస్తారు. గతంలో బోర్డులోని ఏ పెద్ద మనిషి కూడా ఇలాంటి పార్టీలు ఇవ్వలేదు. ఠాకూర్ ఇచ్చిన పార్టీకి పలువురు రాజకీయ నాయకులు, బయటి వ్యక్తులు వచ్చారు. మరి కార్యదర్శిగా ఓ బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం సమంజసమా? ఇది బోర్డులోని మిగిలిన వ్యక్తులకు కనిపించలేదా?
 
 అన్నీ మనకే రావాలి
 అనురాగ్ ఠాకూర్ బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికయ్యాక తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌కు కావలసినంత మేలు చేసుకుంటూ వె ళుతున్నారు. ఆయన బోర్డు పదవిలోకి రాకముందు అడపాదడపా అక్కడ మ్యాచ్‌లు జరిగేవి. మిగిలిన మైదానాలతో పోలిస్తే చిన్నది కావడం, వా తావరణ పరిస్థితులు కూడా కఠినంగా ఉండటం వల్ల ధర్మశాల మైదానానికి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఠాకూర్ వచ్చాక వరుసగా ప్ర తి సిరీస్‌లోనూ అక్కడ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. రొటేషన్ పాలసీ కూడా పక్కకు పోయింది. తాజాగా టెస్టు హోదా కూడా తెచ్చుకున్నా రు. నేపాల్ జట్టును పిలిచి అక్కడ క్యాంప్ ఏర్పాటు చేయించారు. ఆసి యా క్రికెట్ కౌన్సిల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా అక్కడికే వెళ్లింది. వీ టన్నింటి వల్ల బీసీసీఐ నుంచి డబ్బు ఆ రాష్ట్ర సంఘానికి వెళుతుంది.
 
 రెండే వేదికల్లో 17 మ్యాచ్‌లు....
 ఇక మార్చిలో భారత్‌లో జరిగే ఐసీసీ టి20 ప్రపంచకప్‌కు వేదికల ఎంపికలోనూ తీవ్ర పక్షపాతం చూపించారు. ఠాకూర్‌కు చెందిన ధర్మశాల, మనోహర్‌కు చెందిన నాగ్‌పూర్‌లలో ఏకంగా 17 మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం 35 మ్యాచ్‌ల్లో దాదాపు సగం ఈ రెండు నగరాలకే ఇచ్చారు. ఒక్కో మ్యాచ్ నిర్వహణ వల్ల క్రికెట్ సంఘానికి సగటున 2 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తుంది. దేశంలో ప్రధాన క్రికెట్ సెంటర్ చెన్నైని పూర్తిగా విస్మరించారు. అలాగే ఢిల్లీ, చండీగఢ్, ముంబై, కోల్‌కతా, బెంగళూరులకు మిగిలిన మ్యాచ్‌లను పంచారు. దేశంలో మొత్తం 20 క్రికెట్ వేదికలు ఉన్నాయి. ఇందులో 15 మైదానాలకు టెస్టు హోదా ఉంది. ఇటీవల ధర్మశాలతో పాటు టెస్టు హోదా పొందిన పుణే, రాంచీ, వైజాగ్, రాజ్‌కోట్, ఇండోర్‌లకు ఒక్క మ్యాచ్ కూడా ఇవ్వలేదు.
 
 భారత్-పాక్ మ్యాచ్‌కు  23 వేల మందేనా?
 వేదికల కేటాయింపులో ధర్మశాలకు పెద్ద పీట వేయడంతో భారత్, పాక్ మ్యాచ్‌ను కూడా ఇక్కడే నిర్వహించబోతున్నారు. ఈ స్టేడియం సామర్ధ్యం కేవలం 23 వేలు. 50 వేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్ చూడగల వేదికలు దేశంలో చాలా ఉన్నాయి. భారత్, పాక్‌ల మధ్య ప్రపంచకప్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ వల్ల దీనికి ప్రేక్షకులు పోటెత్తుతారు. అనేక దేశాల నుంచి అభిమానులు వస్తారు. అయినా కేవలం 23 వేల మంది చూడగల స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా