ఇంతకీ భారత్, పాక్ మ్యాచ్ ఎక్కడ?

1 Mar, 2016 16:13 IST|Sakshi
ఇంతకీ భారత్, పాక్ మ్యాచ్ ఎక్కడ?

న్యూఢిల్లీ: టి-20 ప్రపంచ కప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ల మధ్య ఈ నెల 19న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్పై అనిశ్చితి ఏర్పడింది. ఈ మ్యాచ్కు తగిన భద్రత కల్పించలేమని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కేంద్ర హోం శాఖకు ఈ మేరకు లేఖ రాశారు. భారత్, పాక్ మ్యాచ్కు భద్రత కల్పించడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యంకాదని లేఖలో పేర్కొన్నారు. పాక్తో మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వరాదని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్ను ఎక్కడ నిర్వహిస్తారు? బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుదన్నది సందిగ్ధంగా మారింది.  

కాగా హిమాచల్ ప్రదేశ్ నిర్ణయాన్ని బీసీసీఐ కార్యదర్శి, బీజేపీ ఎంపీ అయిన అనురాగ్ ఠాకూర్ తప్పుపట్టారు. ధర్మశాల వేదికగా భారత్-పాక్ మ్యాచ్ నిర్వహించనున్న విషయం కొన్ని నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసని, ఆ సమయంలో ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ విషయంలో రాజకీయాలు చేయరాదని అన్నారు. టి-20 ప్రపంచ కప్ వేదికలను ఏడాది క్రితమే బోర్డు ఖరారు చేసిందని, ఆరు నెలల ముందు మ్యాచ్లను కేటాయించామని స్పష్టం చేశారు. భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు కూడా అమ్మారని, ఆఖరు నిమిషంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం సరికాదన్నారు. దీనివల్ల భారత ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పారు. దక్షిణాసియా గేమ్స్ సందర్భంగా పాకిస్తాన్ క్రీడాకారులకు అసోం ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు