అజహర్కు ఆలస్యంగా ఆహ్వానం..

17 Sep, 2016 11:46 IST|Sakshi
అజహర్కు ఆలస్యంగా ఆహ్వానం..

కాన్పూర్: మరో ఐదు రోజుల్లో న్యూజిలాండ్తో జరుగనున్న భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్కు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్కు ఆహ్వానం అందింది. తొలుత ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అజహర్  పేరును పక్కను పెట్టిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ).. అనేక తర్జన భర్జనల అనంతరం ఈ మాజీ కెప్టెన్ను ఆహ్వానించడానికి నిర్ణయించింది. అజహర్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఉండటమే అతని పేరును ముందుగా పరిశీలించకపోవడానికి ప్రధాన కారణం. అయితే అజహర్ను పిలవకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉందని భావించిన బీసీసీఐ పేరెంట్ బాడీ.. ఆలస్యంగా అతనికి ఆహ్వానం పంపింది.

ఈ కార్యక్రమానికి  ముందుగా మాజీ కెప్టెన్లు నారీ కాంట్రాక్టర్, చందు బోర్డే, దిలీప్ వెంగసర్కార్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, కృష్ణమాచారి శ్రీకాంత్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, అజిత్ వాడేకర్లకు ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే. కాగా, అజహర్ ను ఆహ్వానించే క్రమంలో  బోర్డు పెద్దలు తమ నిర్ణయాన్ని సవరించుకున్నారు.

 

కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత క్రికెట్ జట్టు 500వ టెస్టు జరుగనుంది. ఈ టెస్టు మ్యాచ్ను వేడుకలా నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. దీనిలో భాగంగా భారత మాజీ కెప్టెన్లను ఆహ్వానించడంతో పాటు '500వ టెస్టు' అని ముద్రించిన వెండి నాణంతో టాస్ వేయాలని నిశ్చయించారు.

 

ఈ మేరకు అజహర్ ను ఆహ్వానించిన విషయాన్ని సీనియర్ బీసీసీఐ అధికారి రాజీవ్ శుక్లా ధృవీకరించారు.  అజహర్ ను పిలవడంలో ఎటువంటి తప్పిదం జరగలేదంటూ ఆయన తెలిపారు. అయితే చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ కు సచిన్, వెంగసర్కార్, శ్రీకాంత్, అజహర్లు హాజరు కావడానికి ఇప్పటికే అంగీకారం తెలపగా, అజిత్ వాడేకర్ మాత్రం అనారోగ్యం కారణంగా హాజరుకాలేనని బోర్డుకు తెలిపినట్లు రాజీవ్ శుక్లా తెలిపారు.

మరిన్ని వార్తలు