బీసీసీఐ ప్రజా సంస్థే: లా కమిషన్‌

13 Feb, 2018 04:25 IST|Sakshi

ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని సిఫారసు

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి మింగుడు పడని నిర్ణయాన్ని లా కమిషన్‌ తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఈ క్రికెట్‌ బోర్డు ప్రజా సంస్థ అని తేల్చింది. సమాచార హక్కు (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలని సిఫారసు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం లా కమిషన్‌ సిఫారసులను ఆమోదిస్తే, ఆర్టీఐ చట్టపరిధిలోకి బోర్డు వస్తే... కోర్టుల్లో ఇక ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్‌) వెల్లువెత్తుతాయి. జట్ల సెలక్షన్, ఆటగాళ్లను ఏ ప్రాతిపదికన తీసుకున్నారని పిల్‌ దాఖలు చేసే అవకాశాలుంటాయి.

జస్టిస్‌ బి.ఎస్‌.చౌహాన్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న లా కమిషన్‌... బోర్డు, ఆటగాళ్లకు అందుతున్న పురస్కారాలను ఈ సందర్భంగా విశ్లేషించింది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు తమ జెర్సీలపై త్రివర్ణాలను, హెల్మెట్‌లపై అశోక ధర్మచక్రాన్ని ప్రముఖంగా ధరిస్తున్నారని, వారు సాధించిన ఘనతలకు భారత ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారాలను, పన్ను మినహాయింపులను, ప్రోత్సాహకాలను అందిస్తోందని... కాబట్టి దీన్ని ప్రైవేట్‌ ఆర్గనైజేషన్‌గా చూడలేమని, ప్రభుత్వ సంస్థే అవుతుందని కమిషన్‌ తమ సిఫారసులో పేర్కొంది.

మరిన్ని వార్తలు