శ్రీనివాసన్కు మరోసారి చుక్కెదురు

2 Aug, 2013 16:08 IST|Sakshi
శ్రీనివాసన్కు మరోసారి చుక్కెదురు

బీసీసీఐ అధ్యక్ష పదవిని తిరిగి చేపట్టాలని శతవిధాల ప్రయత్నిస్తున్న ఎన్. శ్రీనివాసన్కు దెబ్బదెబ్బ తగులుతోంది. బీసీసీఐ అధ్యక్ష పీఠాన్ని మళ్లీ అధిష్టించేందుకు సిద్ధమయిన శ్రీనివాసన్కు మరోసారి చుక్కెదురయింది. నేడు జరగాల్సిన వర్కింగ్ కమిటీ కీలక సమావేశం రద్దవడంతో ఆయనకు నిరాశ తప్పలేదు. మరోవైపు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.

బాంబే హైకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయనే భయంతో వర్కింగ్ కమిటీ సమావేశాన్ని బీసీసీఐ రద్దు చేసింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై బీసీసీఐ నియమించిన ద్విసభ్య కమిటీ చట్టవిరుద్దమైందని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీనివాసన్ను అధ్యక్ష పీఠంపై కూర్చోబెడితే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశముందని బీసీసీఐ భావించింది. దీంతో వర్కింగ్ కమిటీ సమావేశాన్ని రద్దు చేసింది.

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో శ్రీనివాసన్ అల్లుడు మెయ్యప్పన్‌పై విచారణ కమిటీని నియమించాక బోర్డు అధ్యక్ష పదవి నుంచి శ్రీనివాసన్ తాత్కాలికంగా తప్పుకున్నారు. జగ్మోహన్ దాల్మియా తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే ద్విసభ్య కమిటీ మెయ్యప్పన్‌కు క్లీన్చీట్ ఇవ్వడంతో అధ్యక్ష పదవిని తిరిగి దక్కించుకునేందుకు శ్రీనివాసన్ తహతహలాడుతున్నారు.
 

మరిన్ని వార్తలు