బీసీసీఐ స్పందించలేదు!

5 Oct, 2016 19:05 IST|Sakshi
బీసీసీఐ స్పందించలేదు!

ఇండోర్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి లోధా ప్యానెల్ పలు ప్రతిపాదనలు సూచించిన నేపథ్యంలో ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ పై పలు అనుమానాలు తలెత్తాయి. మరోవైపు కివీస్, భారత్ మధ్య జరగనున్న చివరిదైన మూడో టెస్టుకు మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎంపీసీఏ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ టెస్టు నిర్వహణపై ఇప్పటివరకూ బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని ఎంపీసీఏ కార్యదర్శి మిలింద్ కన్మాడికర్ బుధవారం మీడియాకు వెల్లడించారు.

ఈ నెల 8న ఇండోర్ లోని హోల్కర్ స్డేడియంలో చివరి టెస్టును నిర్వహించనున్న విషయం తెలిసిందే. టెస్టు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు తమకు బీసీసీఐ నుంచి ఎలాంటి మార్గనిర్దేశకాలు అందలేదని తెలిపారు. సుప్రీంకోర్టు నియమించిన ఆర్ఎం లోథా కమిటీ తమ బ్యాంకు ఖాతాలను నిలిపివేసిందని బీసీసీఐ ఆరోపించింది. అయితే బ్యాంకు ఖాతాల నిలుపుదల చేయలేదని లోథా కమిటీ ఓ ప్రకటనలో తెలపడంతో మూడో టెస్టుపై నీలినీడలు తొలిగిపోయాయి. గతంలో బీసీసీఐకి ఇలాంటి సంకట పరిస్థితులు ఎదురుకాలేదు. లోథా కమిటీ సిఫార్సులు అమలుచేయడం కష్టతరమని బీసీసీఐ మొదటినుంచీ చెబుతూనే ఉంది.

మరిన్ని వార్తలు