యువీకి రూ. 3 కోట్లు బాకీ!

12 Oct, 2017 05:18 IST|Sakshi

ఐపీఎల్‌ డబ్బులు చెల్లించని బీసీసీఐ  

ముంబై: భారత జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌కు పాత బాకీలు చెల్లించే విషయంలో కూడా బీసీసీఐ తాత్సారం చేస్తోంది. దాదాపు ఏడాదిన్నర క్రితం నుంచి అతనికి రావాల్సిన రూ. 3 కోట్లను బోర్డు ఇంకా చెల్లించలేదు. 2016 టి20 ప్రపంచ కప్‌ ఆడుతున్న సమయంలో యువరాజ్‌ గాయపడ్డాడు. ఫలితంగా అదే ఏడాది ఐపీఎల్‌లో తొలి ఏడు మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు. బీసీసీఐ ఇన్సూరెన్స్‌ కాంట్రాక్ట్‌ ప్రకారం భారత్‌కు ఆడుతున్న సమయంలో గాయపడి ఎవరైనా ఆటగాడు ఐపీఎల్‌లో ఆడలేకపోతే బోర్డు అతనికి నష్టపరిహారం చెల్లిస్తుంది. ‘తన బాకీల గురించి యువరాజ్‌ బీసీసీఐకి ఎన్నో సార్లు లేఖలు రాశాడు. సన్‌రైజర్స్‌ జట్టులో అతని సహచరుడైన ఆశిష్‌ నెహ్రా కూడా ఐదు మ్యాచ్‌లు ఆడలేదు. అతనికి నష్టపరిహారం లభించింది కానీ యువీ విషయాన్ని మాత్రం ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు’ అని అతని సన్నిహితుడు ఒకరు వ్యాఖ్యానించారు. అయితే యువీ విషయంలో ఎలాంటి వివక్ష లేదని, సాంకేతిక కారణాలతో ఆలస్యం జరిగి ఉంటుందని బోర్డు అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
 
‘లారెస్‌’ అంబాసిడర్‌గా: ప్రతిష్టాత్మక ‘లారెస్‌ స్పోర్ట్‌ ఫర్‌ గుడ్‌’ సంస్థకు యువరాజ్‌ భారత్‌లో బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. బుధవారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో లారెస్‌ ఈ ప్రకటన చేసింది. వివిధ క్రీడాంశాల్లో కుర్రాళ్లను ప్రోత్సహించి తీర్చిదిద్దడంలో యువీ సహకరిస్తాడు. ఈ సంద ర్భంగా 2007 టి20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్లో  తన 6  సిక్సర్ల ఘనతను గుర్తు చేసుకుంటూ ‘అందరికీ ఆ ఆరు సిక్సర్లు మాత్రమే గుర్తుండి పోయాయి. అంతకు కొద్ది రోజుల క్రితమే ఇంగ్లండ్‌ తో నే  జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో నేను ఐదు సిక్సర్లు ఇచ్చిన విషయం ఎవరికీ గుర్తుండకపోవడం నా అదృష్టం. ఆరు సిక్సర్లతో తగిన రీతిలో వారికి జవాబివ్వడం సంతోషకరం’ అని యువీ వ్యాఖ్యానించాడు.   

మరిన్ని వార్తలు