60 ఏళ్లకు మించరాదు! 

17 Jul, 2019 02:35 IST|Sakshi

భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవికి వయోపరిమితి

 దరఖాస్తులు కోరిన బీసీసీఐ 

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ కోచ్‌లకు కూడా 

విండీస్‌ సిరీస్‌తో ముగియనున్న ప్రస్తుత హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి పదవీకాలం 

ముంబై: భారత క్రికెట్‌ జట్టు కొత్త శిక్షకుల వేటలో పడింది. టీమ్‌ హెడ్‌ కోచ్‌ సహా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ కోచ్‌లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కొత్తగా దరఖాస్తులు కోరింది. వీటితో పాటు ఫిజియోథెరపిస్ట్, స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్, అడ్మినిస్ట్రేటర్‌ మేనేజర్‌ల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించిన బోర్డు ఈ నెల 30ని తుది గడువుగా నిర్ణయించింది. ప్రస్తుతం పని చేస్తున్న సహాయక సిబ్బంది పదవీకాలం వాస్తవానికి ప్రపంచ కప్‌తోనే ముగిసింది. అయితే వెంటనే వెస్టిండీస్‌ పర్యటన ప్రారంభం అవుతుండటంతో వారికి మరో 45 రోజుల పొడిగింపు లభించింది. బీసీసీఐ ఈ సారి హెడ్‌ కోచ్‌ పదవి విషయంలో వయోపరిమితిని విధించడం విశేషం. దరఖాస్తు చేసే వ్యక్తి 60 ఏళ్లకు మించరాదని నిబంధన విధించింది. దీంతోపాటు కొన్ని ప్రధాన అర్హతలను సూచించింది. ప్రధాన టెస్టు జట్టుకు కనీసం రెండేళ్లు ప్రధాన కోచ్‌గా పని చేసి ఉండాలని లేదా అసోసియేట్‌ జట్టు లేదా ఐపీఎల్‌ జట్టుకైనా కనీసం మూడేళ్ల పని చేసి ఉండాలని నిబంధన పెట్టింది.

30 టెస్టు మ్యాచ్‌లు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవం ఉండాలి. లేదంటే బీసీసీఐ లెవల్‌–3 కోచింగ్‌ సర్టిఫికెట్‌ ఉండాలనేది నిబంధన. బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌లు 2014లో ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే సిరీస్‌ నుంచి జట్టుతో ఉన్నారు. అదే సమయంలో బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ జట్టుతో చేరినా... కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో అతను పదవి కోల్పోయాడు. అయితే రవిశాస్త్రి మళ్లీ కోచ్‌గా వచ్చాక అరుణ్‌ను తన బృందంలో చేర్చుకున్నాడు. జూలై 2015 నుంచి ఫిజియోథెరపిస్ట్‌ ప్యాట్రిక్‌ ఫార్హర్ట్, స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ శంకర్‌ బసు టీమిండియాతో కలిసి పని చేస్తున్నారు. వీరిద్దరి శ్రమ వల్లే భారత జట్టు ఫిట్‌నెస్‌పరంగా అత్యున్నత ప్రమాణాలు అందుకోగలిగింది. వీరిద్దరి కాంట్రాక్ట్‌ సైతం ప్రపంచ కప్‌తోనే ముగియగా... మళ్లీ కొనసాగటానికి ఆసక్తి చూపించలేదు. దాంతో కొత్తవారి ఎంపిక ఖాయమైంది. ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌గా ఉన్న సునీల్‌ సుబ్రమణ్యన్‌ స్థానంలోనూ మరొకరి నియామకానికి బోర్డు దరఖాస్తులు కోరింది. కొత్తగా ఎంపికయ్యే సహాయక సిబ్బంది  పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్‌ 3 నుంచి నవంబర్‌ 24, 2021 వరకు ఉంటుంది. సెప్టెంబర్‌ 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌తో వీరంతా తమ బాధ్యతలు చేపడతారు. అక్టోబర్‌ 22 వరకు బోర్డు బాధ్యతలు నిర్వర్తించనున్న క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ)నే ఈ మొత్తం నియామక ప్రక్రియను  పర్యవేక్షిస్తుంది.  

శాస్త్రి కొనసాగుతాడా..! 
కెప్టెన్‌ కోహ్లితో విభేదాల కారణంగా అనిల్‌ కుంబ్లే ప్రధాన కోచ్‌ పదవి నుంచి తప్పుకున్న తర్వాత 57 ఏళ్ల రవిశాస్త్రి జూలై 2017లో బాధ్యతలు చేపట్టాడు. అతని మార్గనిర్దేశనంలో భారత జట్టు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో టెస్టు సిరీస్‌లు ఓడినా, ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి చారిత్రాత్మక సిరీస్‌ విజయం సాధించింది. వన్డేల్లో కొంత కాలంగా అద్భుతమైన రికార్డును కొనసాగించిన టీమిండియా ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌కు వచ్చేసరికి మాత్రం సెమీఫైనల్‌కే పరిమితమైంది. కోచ్‌గా పనితీరుపై గొప్ప ప్రశంసలేవీ పొందకపోయినా... కోహ్లితో సాన్నిహిత్యంతో పాటు జట్టు వరుస విజయాల కారణంగా శాస్త్రి కోచింగ్‌లో పెద్దగా లోపాలేమీ కనిపించలేదు. బాధ్యతలు తీసుకున్న సమయంలో శాస్త్రి లక్ష్యం కూడా వరల్డ్‌ కప్‌ అయి ఉండవచ్చు. టోర్నీ గెలిచి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. అతనికి బీసీసీఐ ఏడాదికి రూ. 8.20 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించింది! తాజాగా బోర్డు చేసిన ప్రకటన ప్రకారం ప్రస్తుతం పని చేస్తున్న సహాయక సిబ్బంది ఎవరూ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరం లేదు. తమంతట తాము తప్పుకుంటే తప్ప వారిని కూడా ఈ ప్రక్రియలో పరిశీలనలోకి తీసుకుంటారు. అయితే వీరంతా కొనసాగేందుకు ఇష్టపడతారా అనేదానిపై తమకు స్పష్టత లేదని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పుడే ప్రపంచ కప్‌ ముగియగా, వచ్చే ఏడాది నవంబరులో గానీ టి20 ప్రపంచ కప్‌ స్థాయి టోర్నీ లేదు. భారత్‌కు సవాల్‌కు నిలిచే సిరీస్‌లు కూడా ఇప్పట్లో లేవు. కాబట్టి శిక్షణపై శాస్త్రికి    అనాసక్తి ఉండవచ్చని సమాచారం. మరోసారి అతను వ్యాఖ్యానంపై ఆసక్తి చూపిస్తే భారత్‌ కొత్త కోచ్‌ను చూడవచ్చు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు