మిథాలీ మెయిల్‌ ఎలా లీకైంది?

28 Nov, 2018 21:09 IST|Sakshi

ముంబై : జట్టు కోసం ఎంతో చేసిన తనను అడుగడుగున అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తూ భారత మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్.. బీసీసీఐకి మెయిల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ మెయిల్‌లో జట్టు కోచ్‌ రమేశ్‌ పొవార్‌, సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీ (సీఓఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీలపై మిథాలీ సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరూ తన కెరీర్‌ని నాశనం చేయాలని, తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని చేసిన ప్రయత్నం చూస్తే దేశానికి ఇన్నేళ్ల పాటు తాను చేసిన సేవలకు ఎలాంటి విలువ లేదేమో అనిపిస్తోందని ఈ హైదరాబాదీ క్రికెటర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

అయితే.. మిథాలీ బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి, జీఎం సబా కరీమ్‌లకు పంపిన మెయిల్ మీడియాకు ఎలా లీకైందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. దీనిపై బీసీసీఐ పెద్దలు గుస్సా అవుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బీసీసీఐ తాత్కలిక సెక్రటరీ అమితాబ్‌ చౌదరి మిథాలీ మెయిల్‌ మీడియాకు ఎలా లీకైందో వివరిస్తూ సీఈవో రాహుల్‌ జోహ్రి, సబాకరీమ్‌లకు మెయిల్‌ చేశారు. ‘ ఈ రోజు నేను మీడియాలో చూసింది.. లీకుల ద్వారా బయటకు వచ్చిన మిథాలీ రాసిన మెయిల్‌‌. కానీ ఈ మెయిల్‌ను ఎవరు లీక్‌ చేశారో మాత్రం కచ్చితంగా చెప్పలేను. జాతీయ మహిళా సెలక్షన్‌ కన్వీనర్‌ సంతకం చేసినట్లుగా ఉన్న ఆ మెయిల్‌ కాపీని అందుకున్న మీడియా ప్రతినిధులు నాకు పంపించారు. ఈ లీక్స్‌తో సంబంధిత వ్యక్తులు, బీసీసీఐ ప్రతిష్ట దెబ్బతింటుంది. త్వరగా ఈ కేసు వాస్తవాలు తెలియజేయండి’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు