ఐపీఎల్‌ ఆతిథ్యానికి మేము సిద్ధం: న్యూజిలాండ్‌

6 Jul, 2020 19:59 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి29న ప్రారంభమవ్వాల్సిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ను లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జరిగే ఐపీఎల్.. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది భారత్‌లో జరిగే అవకాశం కనిపించకపోడంతో ఐపీఎల్ 2020 సీజన్‌ని విదేశాల్లోనూ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. అయితే ఇప్పటికే ఐపీఎల్‌కు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధమని యూఏఈ, శ్రీలంక దేశాలు ముందుకు రాగా.. తాజాగా ఈ జాబితాలోకి న్యూజిలాండ్‌ కూడా చేరింది. బీసీసీఐ ముందుకొస్తే ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని న్యూజిలాండ్‌ పేర్కొంది. న్యూజిలాండ్‌లో కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో.. టోర్నీ నిర్వహించేందుకు ఆ దేశం ముందుకొచ్చింది.(‘ఐపీఎల్‌తో పెద్దగా ఒరిగిందేమీ లేదు’)

దీనిపై బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ టోర్నీని ఇండియా నిర్వహించాలనే మా మొదటి ప్రాధాన్యత. ఇక్కడ సాధ్యం కాని పరిస్థితుల్లో విదేశాల్లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తాం. యూఏఈ, శ్రీలంక తర్వాత న్యూజిలాండ్ కూడా తమ దేశంలో ఐపీఎల్ నిర్వహణకు ఆసక్తి చూపుతోంది. భాగస్వాములందరితోనూ సమావేశమై నిర్ణయం తీసుకుంటాం. ఆటగాళ్ల భద్రతే అన్నింటికన్నా ముఖ్యమైనది. ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు’. అని పేర్కొన్నారు. కాగా గతంలోనూ పలుసార్లు ఐపీఎల్‌ టోర్నీని విదేశాల్లో నిర్వహించారు. 2009 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో నిర్వహించగా, ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలోనూ కొన్ని మ్యాచ్‌‌లకి యూఏఈ ఆతిథ్యమిచ్చింది. (‘అలా చేసి ఐపీఎల్‌ జరిపితే ప్రశ్నలు తప్పవు’)

మరిన్ని వార్తలు