ఐసీసీకి రూ. 2.4 కోట్లు చెల్లించిన బీసీసీఐ

16 Dec, 2015 23:43 IST|Sakshi
ఐసీసీకి రూ. 2.4 కోట్లు చెల్లించిన బీసీసీఐ

 ప్రపంచకప్‌కు అదనపు సభ్యుడిని తీసుకెళ్లినందుకు...
 ముంబై:
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ప్రపంచకప్‌లో భారత జట్టు వెంట అదనంగా ఓ క్రికెటర్‌ను తీసుకెళ్లినందుకు బీసీసీఐ 2.4 కోట్ల రూపాయలను ఐసీసీకి చెల్లించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ జట్టులోనైనా 15 మందికే అనుమతి ఇస్తారు. అయితే టీమిండియా తమ 16వ సభ్యుడిగా ముంబై పేసర్ ధవల్ కులకర్ణిని తీసుకెళ్లింది. టోర్నీ మొత్తం అతను జట్టుతో పాటే ఉన్నాడు. దీంతో విమాన చార్జీలు, వసతి సౌకర్యాలు, భోజన ఖర్చుల కింద ఐసీసీ రూ. 2.4 కోట్లు చార్జ్ చేసింది. రూ. 25 లక్షలకు మించి చేసిన చెల్లింపు వివరాలను బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.
 
  ఐపీఎల్-2015 కోసం ఐసీసీ అవినీతి నిరోధక, భద్రతా యూనిట్ సేవలను వినియోగించుకున్నందుకు రూ. 2.49 కోట్లను చెల్లించింది. మరోవైపు పలు రాష్ట్ర సంఘాలకు చెల్లించాల్సిన సబ్సిడీ మొత్తాన్ని కూడా అందజేసింది. వార్షిక సర్వసభ్య సమావేశం ప్రతిపాదన మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు రూ. 8.43 కోట్లు చెల్లించింది. 2014లో ఐపీఎల్‌లో ఆడలేకపోయిన జహీర్ ఖాన్‌కు రూ. 81 లక్షలు; జూలై నుంచి సెప్టెంబర్ వరకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్‌కు రూ. 89 లక్షలు చెల్లించింది. చాలా మంది క్రికెటర్లకు చెల్లించాల్సిన మ్యాచ్ ఫీజులు, ఇతర ఖర్చులను అందజేసింది.
 

మరిన్ని వార్తలు