మహిళల క్రికెట్‌లోనూ భారత్‌ ‘ఎ’ పర్యటనలు

29 Aug, 2017 01:18 IST|Sakshi
మహిళల క్రికెట్‌లోనూ భారత్‌ ‘ఎ’ పర్యటనలు

న్యూఢిల్లీ: మహిళల క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు బీసీసీఐ నడుం బిగించనుంది. ఇటీవలి వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు అద్వితీయ పోరాటం దేశవ్యాప్తంగా క్రీడాభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో పురుషుల జట్టుకు దీటుగా మహిళా క్రికెటర్లను కూడా తీర్చిదిద్దాలని బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల జట్టును కూడా భారత్‌ ‘ఎ’ పర్యటనలకు పంపాలని నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా అండర్‌–16 దేశవాళీ జోనల్‌ టోర్నమెంట్‌లను విస్తరించాలని భావిస్తోంది.

 ఇప్పటిదాకా ఆలిండియా జూనియర్‌ టోర్నీలు కేవలం అండర్‌–19, అండర్‌–23కి మాత్రమే పరిమితమయ్యాయి. బుధవారం జరిగే సమావేశంలో మహిళల క్రికెట్‌ అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యల గురించి డయానా ఎడుల్జీ సారథ్యంలోని మహిళల క్రికెట్‌ కమిటీ చర్చించనుంది. ఇందులో మిథాలీ రాజ్, జులన్‌ గోస్వామి సభ్యులుగా ఉన్నారు. ‘మహిళల జట్టుకు కూడా భారత్‌ ‘ఎ’ పర్యటనలు ఉండాలని అనుకున్నాం. అలాగే దేశవాళీ టోర్నీల నిర్వహణను కూడా సమీక్షిస్తాం.

 మహిళల జట్టు రిజర్వ్‌ బెంచ్‌ను కూడా పటిష్టపరచాల్సిన అవసరం ఉంది. మన దేశవాళీ క్రికెట్‌కు అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా తేడా ఉందని కెప్టెన్‌ మిథాలీ అభిప్రాయపడుతోంది. అంతేకాకుండా జట్టుకు ఈ ఏడాది ఎలాంటి అంతర్జాతీయ షెడ్యూల్‌ లేదు. కాబట్టి ఇప్పటికే అన్ని దేశాల బోర్డులకు మేం ద్వైపాక్షిక, ట్రై సిరీస్‌ల కోసం లేఖలు రాశాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

>
మరిన్ని వార్తలు