పాండ్యా, రాహుల్‌లపై నిషేధం ఎత్తేయండి : బీసీసీఐ ఛీఫ్‌

19 Jan, 2019 20:14 IST|Sakshi

ముంబై : టీమిండియా యువ క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌లపై నిషేధం ఎత్తేయాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా సుప్రీం కోర్టు నియమిత పరిపాలకుల కమిటీ (సీఓఏ)ని కోరారు.  ఈ మేరకు ఆయన శనివారం సీఓఏకు లేఖ రాశారు. పాండ్య, రాహుల్‌ వివాదంపై ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక జనరల్‌ సమావేశం జరపలేమని స్పష్టం చేశారు. ‘పాండ్యా, రాహుల్‌లు తప్పు చేశారు. ఇప్పటికే వారిపై నిషేధం విధించి ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధాంతరంగా రప్పించాం. ఇద్దరు ఆటగాళ్లు వారి వ్యాఖ్యల పట్ల బేషరతు క్షమాపణలు చెప్పారు. కావున విచారణ పూర్తేయ్యే వరకు వారిపై నిషేధం ఎత్తేసి జట్టులోకి తీసుకోవాలి. అలాగే న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో ఆడించాలి’ అని సీకే ఖన్నా లేఖలో కోరారు.

బీసీసీఐ నియమావళి ప్రకారం ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే తుది అధికారం బోర్డు నియమించిన అంబుడ్స్‌మన్‌కే ఉంది. ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్‌మన్‌కే ఇవ్వాలి. అయితే ఇప్పటికిప్పుడు అంబుడ్స్‌మన్‌ను నియమించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అంబుడ్స్‌మన్‌ను నియమించే అధికారం కేవలం బోర్డుకే ఉందని...అది ఎన్నికలు నిర్వహించి కార్యవర్గం ఏర్పడిన తర్వాత మాత్రమే సాధ్యమని బీసీసీఐ సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా వాదించడంతో ఈ కేసును వాయిదా వేసింది. వారం రోజుల తర్వాత వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఆటగాళ్లపై సస్పెన్షన్‌ కొనసాగిచండం సరైందరి కాదని ఖన్నా అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఓఏ, బీసీసీఐ ఆఫీస్‌ బేరర్స్‌కు సైతం విజ్ఞప్తి చేశారు. పాండ్యా, రాహుల్‌లు మాట్లాడింది ముమ్మాటికి తప్పేనని, కానీ వారి పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌ ముందు ఇద్దరి ఆటగాళ్లు ప్రాక్టీస్‌ అవసరమని, ఈ యువ ఆటగాళ్ల తప్పును క్షమించి ఓ అవకాశం ఇద్దామని కోరారు.

బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కాఫీ విత్‌ కరణ్‌’ టీవీ షోలో పాండ్యా, రాహుల్‌ ఇద్దరు అశ్లీల రీతిలో మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ షోలో పాండ్యా మాట్లాడుతూ ‘అమ్మాయిల విషయంలో నేనేమీ బుద్ధిమంతుడ్ని కాదు. వాళ్లను అదోటైపుగా చూస్తా. క్లబ్‌లలో వారి ఒంపుసొంపులపై కైపుగా కన్నేస్తా. ఎవరైనా అమ్మాయిని శారీరకంగా కలిస్తే ‘ఆజ్‌ మై కర్‌ కే ఆయా’ (నేను ఈ రోజు ...ఆ పని చేసొచ్చా) అని తల్లిదండ్రులతో చెప్పేస్తా’ అని ఒళ్లు మరిచి వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు