కెప్టెన్‌లా నడిపిస్తా!

24 Oct, 2019 03:46 IST|Sakshi

బీసీసీఐకి కొత్త దిశ చూపిస్తానన్న సౌరవ్‌ గంగూలీ

బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ

తన ప్రణాళికలను వివరించిన మాజీ కెప్టెన్‌  

దాదాపు ఇరవై ఏళ్ల క్రితం తొలిసారి భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైనప్పుడు కనిపించిన ఆత్మవిశ్వాసం... తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టగలననే గుండె ధైర్యం... భవిష్యత్తుపై భరోసా కల్పించే ప్రయత్నం... దారి తప్పిన వ్యవస్థను చక్కబెట్టగలననే నమ్మకం... సరిగ్గా ఇవే లక్షణాలు బీసీసీఐకి 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో 47 ఏళ్ల సౌరవ్‌ చండీదాస్‌ గంగూలీలో మళ్లీ కనిపించాయి.

టీమ్‌ కెప్టెన్‌గా ఎంపికైనప్పుడు తనకు లభించిన బ్లేజర్‌ను ధరించి బోర్డు కార్యాలయానికి వచ్చిన ‘దాదా’ హుందాగా మాట్లాడాడు. రాబోయే రోజుల్లో తన ప్రాధాన్యతలు, ప్రణాళికలకు సంబంధించి ఎలాంటి గందరగోళానికి అవకాశం లేకుండా తొలి మీడియా సమావేశంలో గంగూలీ వాటిపై మరింత స్పష్టతనిచ్చాడు.   

ముంబై: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా సౌరవ్‌ గంగూలీ శైలి అందరికీ చిరపరిచితం. దూకుడైన నాయకుడిగా, ప్రత్యర్థి ఎంతటివాడైనా ఢీ అంటే ఢీ అంటూ తలపడేందుకు వెరవని తత్వంతో టీమిండియాకు కొత్త దిశను అతను చూపించాడు. ఇప్పుడు అదే తరహాలోనే బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పని చేస్తానని అతను చెప్పాడు. తనకు తెలిసిన విధానంలోనే ఫలితాలు రాబడతానని వ్యాఖ్యానించాడు. విభిన్న అంశాలపై గంగూలీ చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే...

బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపిక కావడంపై...
బోర్డు సభ్యులు నాకు ఈ బాధ్యత తీసుకునే అవకాశం ఇవ్వడం గర్వకారణంగా భావిస్తున్నా. బీసీసీఐకి ఇది కొత్త ఆరంభంగా భావిస్తున్నా. నేను కెప్టెన్‌గా ఎంపికైనప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. సంస్కరణలు తీసుకురావాలి. రాష్ట్ర సంఘాలకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇది పెద్ద సవాలే అయినా మార్పు తీసుకు రాగలనని నమ్ముతున్నా. నాకు తెలిసిన పద్ధతిలో, భారత జట్టును కెపె్టన్‌గా ఎలా నడిపించానో ఇక్కడా అలాగే పని చేస్తా. విశ్వసనీయత దెబ్బ తినకుండా, అవినీతికి తావు లేకుండా వ్యవహరిస్తా. గత మూడేళ్లుగా కమిటీ లేదు, సమావేశాలు లేవు కాబట్టి సరిగ్గా ఏం జరిగిందో నాకు తెలీదు. ఇప్పుడు నేను ఏం చేసినా భారత బాగు కోసమే.

ధోని భవిష్యత్తుపై...
ధోనిలాంటి క్రికెటర్‌ ఉండటాన్ని మనం గరి్వంచాలి. అతను సాధించిన ఘనతలు చూస్తే వహ్వా అనిపిస్తాయి. చాంపియన్‌ ఆటగాళ్లు అంత త్వరగా తప్పుకోరు. నన్ను కూడా జట్టులోంచి తొలగించిన తర్వాత మళ్లీ రాలేనన్నారు. కానీ పునరాగమనం చేసి మరో నాలుగేళ్లు ఆడగలిగాను. ధోని మనసులో ఏముందో తెలీదు. నేను ఇంకా మాట్లాడలేదు. అయితే నేను ఇక్కడ ఉన్నంత వరకు ఎవరి గౌరవానికి భంగం కలగదు.  

ఐసీసీ నుంచి రావాల్సిన సొమ్ముపై...
చాలా మంది దీనిపై అవగాహన లేక తప్పుగా మాట్లాడుతున్నారు. కాబట్టి దీనిపై స్పష్టతనిస్తున్నాను. ఐసీసీ నుంచి భారత్‌కు ఐదేళ్ల కాలంలో 372 మిలియన్‌ డాలర్లు రావాల్సి ఉంది. అయితే అందులో రాబోయే రెండు టి20 ప్రపంచకప్‌లు, భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ నిర్వహణ తదితర అంశాలు కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు మనకు రావాల్సిన మొత్తం దాదాపుగా వచ్చేసింది. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే తీసుకోవచ్చు. దీనిపై ఐసీసీతో చర్చిస్తాం.

భారత ఆటగాళ్లు, బోర్డు మధ్య సంబంధాల గురించి...
బోర్డులో ఆటగాళ్ల సఖ్యత విషయంలో నాకు తెలిసి ఎప్పుడూ సమస్య రాలేదు. నేను కెపె్టన్‌గా ఉన్నప్పుడు దాలి్మయా అధ్యక్షుడిగా ఉన్నారు. మేమేదైనా అడగడం, ఆయన ఇవ్వకపోవడం ఎప్పుడూ జరగలేదు. శ్రీనివాసన్, ధోని మధ్య ఎంత సత్సంబంధాలు కొనసాగాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు విరాట్‌ కోహ్లి కెపె్టన్‌గా ఉన్నాడు. భారత జట్టు బాగా ఆడేందుకు అతను ఏం కోరినా ఇవ్వగలిగే స్థాయి సంబంధాలు నేను కొనసాగిస్తాను. కోహ్లి అద్భుతమైన ఆటగాడు. గత కొన్నేళ్లలో అతను జట్టును గొప్ప స్థాయికి తీసుకెళ్లాడు. అతనికి మేం అండగా నిలుస్తాం. 

దేశవాళీ క్రికెట్‌ పరిస్థితి దిగజారుతుండటంపై...
నా మొదటి ప్రాధాన్యత దీనికే. రంజీ ట్రోఫీ ప్రారంభానికి ముందే తగిన చర్యలు తీసుకుంటాం. గత మూడేళ్లలో దేశవాళీలో అన్ని ఫార్మాట్‌లలో కలిపి మ్యాచ్‌ల సంఖ్య వేయి నుంచి దాదాపు 2 వేలకు పెరిగింది. రంజీ ట్రోఫీని పటిష్టంగా మార్చేందుకు, పోటీ పెరిగేందుకు సమగ్రంగా మార్పులు తీసుకొస్తాం. అప్పుడే మనకు గొప్ప క్రికెటర్లు వస్తారు. ఆటగాళ్లకు    ఆర్థికపరమైన భరోసా కలి్పంచడంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాం.  

ప్రేక్షకులు స్టేడియానికి రాకపోవడంపై...
అది వాస్తవం కాదు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు తక్కువగా జనాలు వచ్చినా అదే స్టేడియాలకు ఐపీఎల్‌ సమయంలో ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. ఊరికి దూరంగా ఉండటం, సరైన సౌకర్యాలు లేకపోవడంవంటి సమస్యలు ఉన్నా ఆటకు ఆదరణ తగ్గడం లేదు. కాబట్టి లోపం మరో చోట ఉందని అనిపిస్తోంది. దానిని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం.

ముందే నిర్ణయించుకున్నా...
భారత కెపె్టన్‌గా ఎంపికైనప్పుడు నాకు ఈ బ్లేజర్‌ లభించింది. దానినే ఈ రోజు తొడుక్కోవాలని కూడా నిర్ణయించుకున్నాను. అయితే ఇది ఇంత వదులుగా ఉంటుందని ఊహించలేదు. అయినా సరే ఇక్కడికి వేసుకొచ్చాను. ఇది మంచి ఆలోచనే అనుకుంటున్నా.

తొలి కెప్టెన్‌తో...
బీసీసీఐ సమావేశానికి హెచ్‌సీఏ అధ్యక్షుడి హోదాలో అజహరుద్దీన్‌ హాజరయ్యాడు. బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైన గంగూలీని అభినందిస్తూ అజహర్‌ ఆనందం వ్యక్తం చేశాడు. అజహర్‌ సారథ్యంలోనే గంగూలీ తన తొలి వన్డే (1992–బ్రిస్బేన్‌), తొలి టెస్టు మ్యాచ్‌ (1996–లార్డ్స్‌) బరిలోకి దిగాడు. సౌరవ్‌ కెపె్టన్సీలో అజ్జూ 11 వన్డేలు ఆడాడు. ఫిక్సింగ్, నిషేధం వివాదాలు ఉన్నా అజహర్‌తో గంగూలీ మంచి సంబంధాలు కొనసాగించాడు. ఏడాది క్రితం విండీస్‌తో మ్యాచ్‌కు ముందు ఈడెన్‌ గార్డెన్స్‌లో అజహర్‌ గంట మోగించేందుకు ‘క్యాబ్‌’ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీతో సాన్నిహిత్యమే కారణం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా