రాయుడు సెటైరిక్‌ ట్వీట్‌పై స్పందించిన బీసీసీఐ

17 Apr, 2019 18:16 IST|Sakshi
అంబటి రాయుడు

ముంబై : ప్రపంచకప్‌ జట్టు ఎంపికపై వ్యంగ్యస్త్రాలు సంధిస్తూ భారత క్రికెటర్‌ అంబటిరాయుడు చేసిన ట్వీట్‌పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందించింది. ప్రపంచకప్‌ ఆడాలనే లక్ష్యంతో సిద్దమైన రాయుడికి మెగాఈవెంట్‌కు ఎంపిక చేసిన తుది జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. దాదాపు కాయమనుకున్న స్థానాన్ని.. అసలు ప్రణాళికల్లోనే లేని ఆల్‌రౌండర్‌, తమిళనాడు క్రికెటర్‌ విజయ్‌ శంకర్‌ ఎగరేసుకుపోయాడు. దీంతో  తీవ్ర అసహనం, మనోవేధనకు గురైన రాయుడు.. జట్టు ఎంపికపై సెటైరిక్‌గా ట్వీట్‌ చేసి తన ఆవేదనను బయటపెట్టాడు. రాయుడు కంటే విజయ్‌ శంకరే మూడు రకాలుగా ఉపయోగపడతాడన్న చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణకు వ్యంగ్యంగా.. మూడు రకాలుగా (త్రీ డైమెన్షన్స్‌)  ప్రపంచకప్‌ చూసేందుకు త్రీడి కళ్లద్దాలు ఆర్డర్‌ ఇచ్చానని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. అయితే రాయుడు నేరుగా సెలక్షన్‌ ప్యానల్‌ను విమర్శించకపోవడంతో అంత సీరియస్‌గా తీసుకొని బీసీసీఐ.. ట్వీట్‌ను మాత్రం నోట్‌ చేసుకుంది. 

‘రాయుడు చేసిన ట్వీట్‌ను మేం నోట్‌ చేసుకున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అతని భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటాం. హద్దులు మీరకుండా ఆవేదనను బయటపెట్టుకోవాల్సిన అవసరం అతనికి ఉంది. అతను ఈ బాధ నుంచి తేరుకోవడానికి కొంత సమయం పడుతోంది. దాన్ని మేం అర్థం చేసుకోగలం. ఎలాంటి ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదు. ఇంకా అతను స్టాండ్‌బై. జట్టులో ఎవరైన గాయపడితే రాయుడికి అవకాశం దక్కొచ్చు’  అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు