భారత్-పాక్ పోరును చూడలేమా!

30 Sep, 2016 22:39 IST|Sakshi
భారత్-పాక్ పోరును చూడలేమా!

ఐసీసీ టోర్నీల్లో పాక్, భారత్ లను ఒకే పార్శంలో వేయవద్దు: బీసీసీఐ

దాయాది దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇరు దేశాల క్రికెట్ పై ప్రభావం చూపిస్తున్నాయి. ప్రపంచంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ తర్వాత, క్రికెట్ ప్రేమికులకు ఎక్కువ జోష్ నిచ్చే ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్. అయితే ఇకనుంచి దాయాదుల పోరు చూసే అవకాశాన్ని కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇకపై నిర్వహించే అంతర్జాతీయ టోర్నీలలో పాక్ జట్టు ఉన్న గ్రూపు, లేక పార్శంలో టీమిండియాను ఉంచరాదని బీసీసీఐ సభ్యులు ఐసీసీని కోరారు.

ముంబైలో శుక్రవారం నాడు  సాధారణ సమావేశం తర్వాత బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్, బోర్డు సభ్యులతో కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతర్జాతీయ టోర్నీల్లో దాయాది జట్టుతో ఆడేందుకే భారత్ విముఖత వ్యక్తం చేస్తున్న తరుణంలో.. ద్వైపాక్షిక సిరీస్ లు కొన్నేళ్లపాటు ఆడే అవకాశం ఉండదు. మరో 7 నెలల్లో నిర్వహించనున్న చాంపియన్స్ ట్రోఫీనే మేజర్ టోర్నీ. ఆ టోర్నీలో ఒకే గ్రూపులో ఉన్న భారత్, పాక్ లు తమ తొలి మ్యాచ్ దాయాది జట్టుతోనే ఆడనుండటం గమనార్హం. అయితే బీసీసీఐ తాజాగా ఐసీసీకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మార్పులు ఉంటాయన్నది తెలియాలంటే కొన్నిరోజుల వరకు వేచిచూడక తప్పదు. జమ్ముకశ్మీర్ లో పాక్ ఉడీ ఉగ్రదాడికి పాల్పడ్డ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతింటున్నాయి

మరిన్ని వార్తలు