సచిన్‌ ‘10’కు టాటా...

30 Nov, 2017 00:27 IST|Sakshi

‘మాస్టర్‌’ జెర్సీ నంబర్‌ ఇక చరిత్రే!

న్యూఢిల్లీ: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ధరించిన పదో నంబర్‌ జెర్సీకి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనధికారికంగా టాటా చెప్పింది. దీంతో ఇక ఆ నంబర్‌ చరిత్రగానే మిగలనుంది. మైదానంలో ఏ భారత ఆటగాడు కూడా 10 జెర్సీతో బరిలోకి దిగడు. 2013లో సచిన్‌ రిటైరయ్యాక ఒక్కసారి మినహా ఈ నాలుగేళ్లలో ఎవరూ ఆ జెర్సీ జోలికి వెళ్లలేదు. ఈ ఏడాది శార్దుల్‌ ఠాకూర్‌ అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో పదో నంబర్‌తో కనిపించడంతో సోషల్‌ మీడియాలో అభిమా నులు విమర్శలు గుప్పించారు. దీంతో ఇప్పటివరకు మళ్లీ ఆ నంబర్‌ కనిపించలేదు. నిజానికి ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ నంబర్‌కూ అధికారికంగా టాటా చెప్పే అవకాశం లేదు. 

అదే వేసుకోవాలనే ఒత్తిడి కూడా లేదు. అయితే ఓ సారి వివాదం రేగడంతో ఆటగాళ్లెవరూ ఆ నంబర్‌ జెర్సీపై ఆసక్తి చూపడం లేదని బోర్డు వర్గాలు తెలిపాయి. ఐపీఎల్‌లో మాత్రం ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ జట్టు టెండూల్కర్‌ గౌరవార్థం ‘10’కు అధికారికంగానే టాటా చెప్పేసింది. అంటే భవిష్యత్తులో సదరు ఫ్రాంచైజీ ఆటగాళ్లెవరూ ‘10’తో కనిపించరు.  ఒక జట్టు జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్‌ పలకడం కొత్తేమీ కాదు. ఫుట్‌బాల్‌లో వివిధ లీగ్‌లలో ఇలా జరగ్గా... బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైకేల్‌ జోర్డాన్‌ రిటైరయ్యాక షికాగో బుల్స్‌ 23 నంబర్‌ జెర్సీకి మంగళం పలికింది. అయితే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ‘ఫిఫా’ మాత్రం ఇలాంటి వాటిని అనుమతించదు. 2002 వరల్డ్‌కప్‌ కోసం అర్జెంటీనా మారడోనాకు గౌరవంగా 10 నంబర్‌ జెర్సీ లేకుండా 23 మంది సభ్యుల టీమ్‌ను ప్రకటించింది. దీనికి ఫిఫా ఒప్పుకోకపోవడంతో 24వ ఆటగాడిగా అప్పటి వరకు లెక్కలో ఉన్న ఏరియల్‌ ఒర్టెగా 10 నంబర్‌తోనే బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పుడు 10 నంబర్‌ను మరో దిగ్గజం మెస్సీ వాడుతున్నాడు.   

మరిన్ని వార్తలు