బోర్డుకు నష్టం లేకుంటేనే...

2 Jul, 2020 04:27 IST|Sakshi

ఐపీఎల్‌ స్పాన్సర్‌ ‘వివో’ను సాగనంపేది

గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలోనే నిర్ణయం

ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతుంటే భారత్‌ ఈ వైరస్‌తోపాటు చైనా కుయుక్తులపై కూడా పోరాడుతోంది. అందులో భాగంగానే ఇటీవల చైనా యాప్‌లపై నిషేధం విధించింది. చైనా వస్తుసేవల్ని కూడా బహిష్కరించాలనే డిమాండ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ డిమాండ్‌ సెగ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి బలంగానే తాకింది. అందుకే ఐపీఎల్‌ ప్రధాన స్పాన్సర్, చైనా మొబైల్‌ కంపెనీ ‘వివో’పై బోర్డులో చర్చ నడుస్తోంది.

సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పుడు భారత క్రికెట్‌ అభిమానులంతా ఈ ఏడాది ఐపీఎల్‌ జరగాలని బలంగా కోరుకుంటున్నారు. అదే సమయంలో ‘వివో’ స్పాన్సర్‌షిప్‌ను వద్దంటున్నారు. ఈ చైనా ఫోన్ల కంపెనీ స్పాన్సర్‌షిప్‌ లేకపోయినంత మాత్రాన బోర్డుకు వచ్చే పెద్ద నష్టమేమీ లేదు. అలాగని భావోద్వేగాల ఆధారంగా నిర్ణయం తీసుకునే ఆర్థిక వ్యవహారం కాదు. అందుకే బీసీసీఐ ఈ అంశంపై ఆచితూచి స్పందిస్తోంది.

ఒప్పందంలోని స్పాన్సర్‌షిప్‌ రద్దు నిబంధన బీసీసీఐకి అనుకూలమైతేనే దానిపై నిర్ణయం తీసుకుంటుందని... రద్దు నిబంధన ప్రతికూలంగా ఉంటే స్పాన్సర్‌షిప్‌ను కొనసాగిస్తుందని బోర్డు వర్గాలు తెలిపాయి. పైగా ఇది చైనా ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చేదేమీ కాదు. ఇటు బోర్డుకు, అటు పన్నుల రూపేణా భారత ప్రభుత్వానికి కోట్లు తెచ్చిపెట్టే ఆర్థికాంశం. ఈ విషయాన్ని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ ఇదివరకే వివరించారు. ఇది చైనాకిచ్చిన కాంట్రాక్టు కాదని .... మనకు సాలీనా వస్తున్న రూ.440 కోట్ల రాబడి అన్నారు. 

పాలకమండలి సమావేశమైతేనే... 
2020 ఐపీఎల్‌ సీజన్‌పై తేల్చాలన్నా... ‘వివో’ను వద్దనుకోవాలన్నా... అది మీడియా సమావేశంలో నిర్ణయించే తేలికైన అంశం కాదు. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ (జీసీ) భేటీలోనే తేలు తుంది. అప్పుడే సాధ్యాసాధ్యాలను కూలంకశంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఇదే విషయాన్ని జీసీ సభ్యులు తెలిపారు. అయితే ఐపీఎల్‌ జీసీ మీటింగ్‌ జరగాలంటే టి20 ప్రపంచకప్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆస్ట్రేలియా ఇప్పటికే ఈ ఏడాది మెగా టోర్నీ నిర్వహణపై నిరాసక్తత వ్యక్తపరిచినా... అది ఐసీసీ ఈవెంట్‌ కాబట్టి ఐసీసీనే వెల్లడించాలి.

మనకు ఇప్పటికే టి20 వరల్డ్‌కప్‌ సహా, ఆసియా కప్‌పై ఎలాంటి సమాచారం లేదు. అలాంటపుడు దేని కోసం ఐపీఎల్‌ పాలక మండలి సమావేశమవుతుంది? ఒకవేళ ఆ టోర్నీలు లేకపోతేనే ఐపీఎల్‌పై ఓ నిర్ణయం తీసుకుం టుంది’ అని సీనియర్‌ బోర్డు అధికారి, జీసీ సభ్యుడు చెప్పారు. ఇక ‘వివో’పై కూడా అప్పుడే చర్చించే వీలుంటుందని, ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే బోర్డుకు పోయేదేమీ లేదనుకుంటే తప్పకుండా పరిశీలిస్తుందన్నారు. కానీ బీసీసీఐనే పరిహారం చెల్లించాల్సిన ప్రతికూలాంశాలుంటే మాత్రం ఒప్పందం గడువు 2022 దాకా వేచి చూడాలన్నారు.

ఒక్క ముంబైలోనే ఐపీఎల్‌! 
ఈ ఏడాది ఐపీఎల్‌ జరిగితే ఒక్క నగరానికే పరిమితం చేయాలని కొందరు బీసీసీఐ సీనియర్‌ అధికారులు జీసీ వర్గాలకు సూచించారు. అది ముంబై అయితేనే సౌకర్యంగా ఉంటుందన్నారు. ముంబైలో మూడు అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాలున్నాయి. వాంఖెడే, బ్రబౌర్న్, డీవై పాటిల్‌ స్టేడియాలున్నాయి. దీంతోపాటు రిలయెన్స్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు కూడా ప్రత్యేకించి మైదానం ఉంది.

అలాగే స్టార్‌ హోటళ్లకు కొదవే లేదు. అయితే ఇదేమీ ఇప్పటి సూచన కాదు. మహారాష్ట్రలో వైరస్‌ సాధారణంగా ఉన్నపుడు చేసిన సూచన... కానీ ఇప్పుడైతే ముంబై పరిస్థితి ఘోరంగా ఉంది. అక్టోబర్‌కల్లా ముంబైలో వైరస్‌ నియంత్రణలోకి వస్తుందన్న ఆశలుంటేనే ఒకే వేదికపై ఐపీఎల్‌ నిర్వహించాలన్న సూచనను జీసీ పరిశీలిస్తుంది.   

మరిన్ని వార్తలు