బీసీసీఐ చొరవ చూపాలి

10 Feb, 2018 00:22 IST|Sakshi
బీసీసీఐ

సునీల్‌ గావస్కర్‌ 

డివిలియర్స్‌ వంటి ఆటగాడు తిరిగి జట్టుతో చేరడం చిన్న విషయమేం కాదు. ఆటను అతడెలా మార్చేయగలడో ప్రపంచానికంతటికీ తెలుసు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ‘పింక్‌ డే’ మ్యాచ్‌లలో అతడి నమ్మశక్యంకాని ఇన్నింగ్స్‌లు మార్క్‌రమ్‌ బృందానికి స్ఫూర్తిదాయకమైనవే. దీంతోపాటు ‘గులాబీ’ రంగు దుస్తుల్లో దక్షిణాఫ్రికా ఇంతవరకు ఓడలేదు. ఓవైపు భారత మణికట్టు స్పిన్‌ ద్వయాన్ని ఎదుర్కోవడంలో సఫారీల వైఫల్యం కొనసాగుతుండగా... మరోవైపు కోహ్లిని నిలువరించడం పెద్ద ఆందోళనగా మారింది. కోహ్లికి రబడ మాత్రమే సవాల్‌ విసరగలుగుతున్నాడు. వీరి పోరాటం చూడదగినది.   

అత్యంత ధనిక బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ... ఛారిటీ మ్యాచ్‌ల నిర్వహణలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా బోర్డులను చూసి నేర్చుకోవాలి. కాస్త చొరవ చూపించి ప్రతి సీజన్‌లో ఒక అంశాన్ని ఎంచుకుని దానిపై అవగాహన కల్పించే ఆలోచన చేయాలి. ఐపీఎల్‌లోనూ ఇలాంటి అంశాలకు చోటివ్వచ్చు. ఆటగాళ్లపై, వారి ఇతరత్రా ఖర్చులతో పోలిస్తే ఇదేమంత పెద్ద మొత్తం కాదు. పైగా వచ్చే మంచి పేరు వెలకట్టలేనిది. విద్యకు సంబంధించిన విషయంపై ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ ఇలానే చేస్తోంది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ‘గ్రీన్‌ డే’ మ్యాచ్‌ ఆడుతోంది. ఇలా ప్రతి ఫ్రాంచైజీ ఒక మంచి ఉద్దేశంతో ముందుకొస్తే సమాజానికి మేలు చేసిన వారవుతారు. డబ్బు ఆడించే ఆటగా ఐపీఎల్‌పై ఉన్న వ్యతిరేకత కూడా కొంత తగ్గుతుంది. 

మరిన్ని వార్తలు