సడలిస్తే... ప్రాక్టీస్‌ను మార్చుతాం: బీసీసీఐ 

15 May, 2020 03:09 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఒకవేళ లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తే భారత క్రికెటర్లు మైదానాల్లో నాణ్యమైన శిక్షణను ప్రారంభించే అవకాశముంటుందని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ తెలిపారు. మే 18 నుంచి నాలుగోవిడత లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లోకి రానుండటంతో ఆటగాళ్లకు ప్రాక్టీస్‌ చేసే వెసులుబాటు దక్కవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడైతే ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. తమ సొంత ఇండోర్‌ ప్రాక్టీస్‌తోనే సరిపెట్టుకుంటున్నారు.

‘క్రికెటర్లు నెట్‌ సెషన్స్‌లో పాల్గొనేందుకు అందుబాటులో ఉండే అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. లాక్‌డౌన్‌–4 మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాలకు అనుమతిలేని పక్షంలో ఆటగాళ్ల నివాసాలకు దగ్గర్లోని మైదానాల్లో వారు ప్రాక్టీస్‌ చేసే అవకాశాలపై దృష్టి సారించాం. ఈ అంశంపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రయాణ ఆంక్షలు సడలించేదాకా ఎలాంటి శిబిరాలు ఏర్పాటు చేయం. ఆటగాళ్ల ఆరోగ్య భద్రతే మాకు అత్యంత ప్రధానం. లాక్‌డౌన్‌ ముగిశాక క్రికెటర్ల కార్యాచరణపై మాకు స్పష్టమైన ప్రణాళిక ఉంది’ అని ధుమాల్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు