ఇక మ్యాచ్‌ల్లేవ్‌..  బీసీసీఐ షట్‌డౌన్‌!

14 Mar, 2020 18:02 IST|Sakshi

న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దాని ప్రభావం ఒక్కో రంగంపై తీవ్ర ప్రభావం చూపుతూ వస్తోంది. ఇప్పటికే  ప్రపంచ వ్యాప్తంగా  వర్తకం, వాణిజ్యం, ఔషధ, పర్యాటకం తదితర రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా వైరస్‌ తీవ్రత ఇప్పుడు క్రీడా రంగాన్ని కూడా వణికిస్తోంది.  వారం రోజులుగా పలు స్పోర్ట్స్‌ ఈవెంట్‌లు రద్దు అవుతుండగా, ఈ సెగ ఇప్పుడు బీసీసీఐని కూడా తాకింది. నిన్న ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..  దక్షిణాఫ్రికాతో జరగాల్సిన ఉన్న వన్డే సిరీస్‌కు కూడా గుడ్‌ బై చెప్పేసింది. తాజాగా దేశవాళీ టోర్నీలు అన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేసింది. ఈనెల 18వ తేదీన ఆరంభం కావాల్సిన ఇరానీ కప్‌తో పాటు సీనియర్‌ వుమెన్స్‌ వన్డే నాకౌట్‌ టోర్నీ, విజ్జీ ట్రోఫీ, సీనియర్‌ వుమెన్స్‌ వన్డే చాలెంజర్‌, వుమెన్స్‌ అండర్‌-19 వన్డే నాకౌట్‌, వుమెన్స్‌ అండర్‌-19 టీ20 లీగ్‌ ఇలా అన్ని టోర్నీలను వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ వీటి వాయిదా కొనసాగనుంది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది బీసీసీఐ.(బాస్‌ గుర్తులేడా వార్న్‌.. )

శుక్రవారం ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. మార్చి 29వ తేదీన ఆరంభం కావాల్సిన ఐపీఎల్‌ను ఏప్రిల్‌ 15కు వాయిదా వేసింది.  కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఏప్రిల్‌ 15 వరకు విదేశీయులకు వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావంతో విదేశీ క్రికెటర్లు అప్పటివరకూ ఐపీఎల్‌ ఆడటానికి భారత్‌కు వచ్చే చాన్స్‌ లేకుండా పోయింది. మరొకవైపు పలు రాష్టాలు కూడా ఐపీఎల్‌ నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఐపీఎల్‌ వాయిదా పడింది. అదే సమయంలో దేశవాళీ టోర్నీలతో పాటు భారత్‌ ఆడాల్సిన పలు టోర్నీలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ప్రస్తుత పరిస్థితి నుంచి ఉపశమనం లభించిన తర్వాతే టోర్నీల నిర్వహణపై ముందుడుగు వేయాలనేది బీసీసీఐ యోచన. దీనిలో భాగంగా ప్రతీవారం కరోన్‌ వైరస్‌పై సమీక్ష నిర్వహించనున్నారు. దాంతో బీసీసీఐ తాత్కాలికంగా షట్‌డౌన్‌ అయినట్లే. (ఊపిరి పీల్చుకున్న కివీస్‌)

మరిన్ని వార్తలు