సశేషం!

11 Jul, 2017 00:48 IST|Sakshi
సశేషం!

భారత కోచ్‌ పేరును ప్రకటించని బీసీసీఐ
ఇంటర్వ్యూలు నిర్వహించిన సీఏసీ
కోచ్‌ లేకుండానే లంక టూర్‌కు!


భారత క్రికెట్‌కు సంబంధించిన ఒక కీలక అంకం ముగిసింది. కొత్త కోచ్‌ ఎంపిక కోసం జరిగిన ఇంటర్వ్యూలకు ఐదుగురు హాజరు కాగా, వారిలో ఎవరికి పదవీ యోగం దక్కుతుందో తేలేందుకు మరికొంత సమయం పట్టనుంది. క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) ఈ విషయంలో ఎలాంటి తొందరపాటును ప్రదర్శించడం లేదు. అనిల్‌ కుంబ్లేతో సాగిన వివాదం నేపథ్యంలో కోహ్లితో కూడా ‘ఒక మాట’ మాట్లాడిన తర్వాతే కోచ్‌ పేరును ప్రకటించవచ్చు. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటనకు కూడా కోచ్‌ లేకుండా భారత జట్టు వెళ్లే అవకాశం ఉంది.  

ముంబై: భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ ఎంపికపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది. ఐదుగురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. ప్రస్తుతానికి తాము కోచ్‌ పేరును ప్రకటించడం లేదని, దీనిపై మరింత చర్చ జరగాల్సి ఉందని సీఏసీ సభ్యుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. సోమవారం గంగూలీతో పాటు వీవీఎస్‌ లక్ష్మణ్, సచిన్‌ టెండూల్కర్‌ (లండన్‌ నుంచి స్కైప్‌ ద్వారా) ఇంటర్వ్యూలు నిర్వహించారు. ‘కోచ్‌ పేరును ఇప్పుడే ప్రకటించడం లేదు. కొన్ని రోజుల సమయం ఇంకా అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాం. ఎంపికకు తొందరేమీ లేదని మా అభిప్రాయం. ఈసారి ఎవరి పేరును ప్రకటించినా వారు 2019 వరల్డ్‌ కప్‌ వరకు కొనసాగుతారు’ అని గంగూలీ స్పష్టం చేశారు.

అంతా అప్పటిలాగే...
సీఏసీ నిర్వహించిన ఇంటర్వ్యూలకు ఐదుగురు అభ్యర్థులు హాజరయ్యారు. రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ (భారత్‌), టామ్‌ మూడీ (ఆస్ట్రేలియా), రిచర్డ్‌ పైబస్‌ (దక్షిణాఫ్రికా)లు తమ శిక్షణ, ప్రణాళికల గురించి వివరించారు. మరో అభ్యర్థి ఫిల్‌ సిమన్స్‌ (విండీస్‌) మాత్రం ఇంటర్వ్యూకు రాలేదు. సెహ్వాగ్‌ ఇంటర్వ్యూ రెండు గంటలకు పైగా సాగింది. అభ్యర్థుల ప్రజెంటేషన్‌ విషయంలో అంతా గత ఏడాది తరహాలోనే సాగిందని గంగూలీ చెప్పారు. ‘భారత క్రికెట్‌ భవిష్యత్తు గురించి అభ్యర్థులు చెప్పిన విషయాలు, ఆలోచనలు గతంలో చూసినవే. నేను గానీ బోర్డు కార్యదర్శి లేదా సీఈఓ గానీ మ్యాచ్‌ బరిలోకి దిగేవాళ్లం కాదు. అందరికంటే ఆటగాళ్లు ముఖ్యం. వారికి సహాయక సిబ్బంది అండగా ఉంటారు. అయితే అందరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉంటే బాగుంటుంది. భారత క్రికెట్‌ మేలు గురించి ఆలోచించే ఏ నిర్ణయమైనా తీసుకుంటాం’ అని ఈ మాజీ కెప్టెన్‌ అన్నారు.

కోహ్లితో చర్చించిన తర్వాతే...
కోచ్‌ పేరును ప్రకటించే ముందు జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో కచ్చితంగా చర్చిస్తామని గంగూలీ వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు మాత్రం కోహ్లి తమ పనిలో కలగజేసుకోలేదని, కోచ్‌గా ఎవరు ఉండాలనే పేరును కూడా సూచించలేదని ఆయన అన్నారు. ‘కోచ్‌ ఎవరితో కలిసి పని చేయాల్సి ఉంటుందో అలాంటి వారితో మాట్లాడటం కూడా చాలా అవసరం. అతను 2019 ప్రపంచ కప్‌ వరకు ఉండాల్సి ఉంటుంది.

ఆరు నెలల తర్వాత అభిప్రాయ భేదాలు రాకూడదు కదా. ఎంపికతో మా పాత్ర ముగిసిపోతుంది కానీ జట్టును ముందుకు నడిపించాల్సింది కెప్టెన్, కోచ్, ఆటగాళ్లు మాత్రమే’ అని ‘దాదా’ చెప్పారు. అలాగే ‘కోచ్‌లు ఎలా పని చేస్తారో కూడా కోహ్లి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది’ అంటూ పరోక్షంగా చురక కూడా అంటించారు. కోహ్లి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నాడు. అతను ఈ నెల 17న భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది.

శాస్త్రికి కష్టమేనా?
ఇంటర్వ్యూకు ముందు వరకు కూడా రవిశాస్త్రి కోచ్‌గా ఎంపికవుతారని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే అంతర్గత సమాచారం ప్రకారం ఇంటర్వ్యూలు ముగిశాక రవిశాస్త్రికి మరీ అనుకూల వాతావరణం ఏమీ లేదు. అసలు కోచ్‌ పేరును నేరుగా ప్రకటించకుండా కోహ్లిని భాగస్వామిగా చేయడంలోనే సీఏసీ చాలా తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా తమ నిర్ణయం కాదని, రేపు కుంబ్లే తరహాలో ఏదైనా జరిగితే కోహ్లిదే బాధ్యత అని కమిటీ చెప్పకనే చెప్పింది. బీసీసీఐలోని ఒక వర్గం చెబుతున్న ప్రకారం... కోహ్లి ముందు సీఏసీ రెండు ప్రత్యామ్నాయాలు ఉంచి అందులో ఒకరిని ఎంపిక చేసుకోమని కోరుతున్నట్లు సమాచారం. అయితే అందులో శాస్త్రి పేరు కాకుండా సెహ్వాగ్, టామ్‌ మూడీ పేర్లు ఉన్నాయని వారు అంటున్నారు!

మరిన్ని వార్తలు