ఎనిమిదేళ్లలో రూ. 3700 కోట్లు

1 Mar, 2014 09:43 IST|Sakshi
ఎనిమిదేళ్లలో రూ. 3700 కోట్లు

భారీగా పెరగనున్న బీసీసీఐ ఆదాయం
 కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడి
 ఎన్నికల షెడ్యూల్ తర్వాతే ఐపీఎల్ వేదికపై నిర్ణయం
 
 భువనేశ్వర్: ఐసీసీలో సమూల మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేసిన భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)... ఆదాయాన్ని కూడా భారీ స్థాయిలో పెంచుకోనుంది. రాబోయే ఎనిమిదేళ్ల (2015-23)లో దాదాపు 600 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 3724 కోట్లు) సంపాదించనుందని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఐసీసీలోని మూడు మేజర్ కమిటీల్లో భారత్ శాశ్వాత సభ్య దేశంగా ఉంటుందని శుక్రవారం ఇక్కడ జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన వెల్లడించారు.
 
  ‘చాలా కాలంగా 68 శాతం ఆదాయాన్ని ఐసీసీకి భారత్ సమకూర్చిపెడుతోంది. అందులో నుంచి 4 శాతం మాత్రమే మనం తీసుకుంటున్నాం. కానీ ప్రస్తుత ప్రణాళికలు అమలైతే రాబోయే రోజుల్లో బోర్డు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఇకపై 21 శాతం మేర ఆదాయం మనకే దక్కుతుంది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ఐసీసీ ఆదాయంలో 75 శాతం మాత్రమే పది సభ్య దేశాలకు సమానంగా పంచేవారు. మిగతాది అసోసియేట్ దేశాలకు వెళ్లేది. ఇతర కార్యక్రమాల వల్ల భారత్‌కు అదనంగా మరో 4 శాతం దక్కేది’ అని పటేల్ వివరించారు.
 
 దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పర్యటనల్లో భారత్ ఘోర వైఫల్యంపై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎంపీ పాండోవ్.. శ్రీనివాసన్‌ను వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రశ్నించారు. దీని గురించి చర్చించకుండా ఐపీఎల్ అంశాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై స్పందించిన శ్రీనివాసన్ మాట్లాడుతూ... దీనిపై విచారణకు ఆదేశించామని, జట్టు సహాయక సిబ్బంది, కోచ్‌తో కూడా మాట్లాడానని చెప్పారు.
 
 ఎన్నికల షెడ్యూల్ తర్వాతే...
 ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే ఐపీఎల్ తుది వేదికను ఖరారు చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ వెల్లడించారు. ‘అవసరమైతే కొన్ని మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహిస్తాం. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, యూఏఈలు ఆతిథ్యమిచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఐపీఎల్ చైర్మన్ బిస్వాల్ తెలిపారు. ఏదేమైనా దీనిపై త్వరలోనే తుది నిర్ణయానికి వస్తాం’ అని శ్రీని వ్యాఖ్యానించారు.
 
 ఒకవేళ మే 15 వరకు ఎన్నికల తంతు పూర్తయితే... మొదటి రౌండ్ మ్యాచ్‌లను యూఏఈ, బంగ్లాలలో నిర్వహించి మిగతా లీగ్‌ను తిరిగి భారత్‌లోనే జరపనున్నట్లు సమాచారం. మే నెల మొత్తం ఎన్నికల ప్రక్రియ కొనసాగితే టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించే అవకాశాలున్నాయి. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌లను పారదర్శకంగా నిర్వహిస్తామని బిస్వాల్ తెలిపారు. ఇందుకోసం ఫ్రాంచైజీలు, ఆటగాళ్లకు అవసరమైన శిక్షణ ఇస్తామన్నారు. ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్‌పై ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను 70 శాతం మేర అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు