ద్వైపాక్షిక సిరీస్ భారత్ లో జరిగే అవకాశం!

10 Nov, 2015 16:30 IST|Sakshi
ద్వైపాక్షిక సిరీస్ భారత్ లో జరిగే అవకాశం!

న్యూఢిల్లీ: పాకిస్థాన్  తో డిసెంబర్ లో జరగాల్సిన ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ పై భారత్ మరోసారి సానుకూలంగా స్పందించింది. ఎప్పట్నుంచో ఈ సిరీస్ పై వస్తున్న పలురకాలైన ఊహాగానాలకు తెరదించాలని భారత్ భావిస్తోంది. ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ ను జరిపితేనే బావుంటుందని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చైర్మన్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  భారత్- పాకిస్థాన్ ల సిరీస్ జరగాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) బలంగా కోరుకుంటుందన్నారు. కాగా, ద్వైపాక్షిక సిరీస్ ను  యూఏఈలో కాకుండా భారత్ లో జరపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

త్వరలో ద్వైపాక్షిక సిరీస్ పై స్పష్టత

 

ఇప్పటికే పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలపై నెలకొన్న ప్రతిష్టంభనకు ఇది సానుకూల మార్గంగానే కనిపిస్తోంది.  కాగా, భారత్ లో సిరీస్ కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయంపైనే ప్రధానంగా ఆధారపడింది. ఒకవేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారత్ లో ఆడటానికి మొగ్గు చూపినా..  అక్కడి ప్రభుత్వం ఏరకంగా స్పందిస్తుందో అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత నెల్లో బీసీసీఐతో చర్చల్లో భాగంగా పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ భారత్ కు రావడంపై పాక్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య స్నేహ పూర్వక వాతావరణం లేనప్పుడు భారత్ కు ఎలా వెళతారని విదేశాంగ శాఖ షహర్యార్ ను ప్రశ్నించింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు సిరీస్ పై ఆశలు పెట్టుకున్నా..  అంతిమంగా ప్రభుత్వ నిర్ణయం తరువాతే సిరీస్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు