మళ్లీ వస్తా.. ఎప్పుడో తెలియదు: హార్దిక్‌

5 Oct, 2019 11:49 IST|Sakshi

లండన్‌: గత కొంతకాలంగా వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు సర్జరీ పూర్తయింది. తన వెన్నునొప్పి గాయానికి సంబంధించి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తైనట్లు హార్దిక్‌ పేర్కొన్నాడు. గత కొంతకాలంగా వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న హార్దిక్‌.. ఇటీవల సర్జరీ నిమిత్తం లండన్‌ వెళ్లాడు.  దాంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు నుంచి హార్దిక్‌కు విశ్రాంతి ఇచ్చారు. సఫారీలతో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్న హార్దిక్‌ను వెన్నునొప్పి గాయంతో సతమతమయ్యాడు.

బెంగళూరు, మొహాలీ జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో పాల్గొన్న హార్దిక్‌.. అటు తర్వాత లండన్‌కు వెళ్లాడు. తన సర్జరీ విజయవంతంగా పూర్తైన విషయాన్ని హార్దిక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పేర్కొన్నాడు. ‘ నా సర్జరీ సక్సెస్‌ అయ్యింది. నేను తేరుకోవాలని ఆశించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. నేను తిరిగి జట్టుతో కలుస్తా.. కానీ సమయం తెలియదు. అప్పటివరకూ నన్ను మిస్‌ అవుతారు’ అంటూ హార్దిక్‌ పేర్కొన్నాడు.

వన్డే వరల్డ్‌కప్‌లో పూర్తిస్థాయిలో ఎటువంటి గాయాల బారిన పడకుండా ఆడిన హార్దిక్‌.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. దాంతో సర్జరీ అవసరమని వైద్యులు సూచించడంతో లండన్‌ వెళ్లాడు. గతేడాది ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తుది పోరులో హార్దిక్‌ను తొలిసారి వెన్నునొప్పి గాయం వేధించింది. ఆ తర్వాత తేరుకున్నప్పటికీ తరుచు ఈ గాయం వేధించడంతో కొన్ని సిరీస్‌లు మిస్‌ అయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లకు గాయం వేధించిన కారణంగానే హార్దిక్‌ దూరం కాగా, వెస్టిండీస్‌ పర్యటనలో కూడా పాల్గొనలేదు.

>
మరిన్ని వార్తలు