విశాఖ తీరాన బీచ్‌ వాలీబాల్‌ ముచ్చట

27 Feb, 2019 07:48 IST|Sakshi
విశాఖ బీచ్‌లో సాధన చేస్తున్న విదేశీ క్రీడాకారిణులు

‘ప్రపంచ టూర్‌’ పోటీలకు విశాఖ తొలిసారిగా ఆతిథ్యం

22 దేశాల జట్లు విశాఖలో సందడి

బీచ్‌లో ఏర్పాట్లతో బోలెడు హడావుడి

విశాఖ స్పోర్ట్స్‌: అందాల హరివిల్లుగా, సోయగాల పొదరిల్లుగా పేరొందిన విశాఖ ఎన్నో ప్రసిద్ధ కార్యక్రమాలకు నెలవైంది. వినోద కార్యక్రమాలకైనా, క్రీడల పోటీల్లోనయినా.. అపూర్వ ఆతిథ్యం ఇచ్చి అందరి మనసులను గెలుచుకుంది. ఈ సుందర సాగర నగరం తొలిసారిగా ఓ అంతర్జాతీయ క్రీడల పోటీలకు వేదికగా నిలుస్తోంది. భారత్‌లో తొలిసారిగా జరగబోయే ప్రపంచ టూర్‌ బీచ్‌ వాలీబాల్‌ పోటీలకు విశాఖ ఆతిథ్యం ఇస్తోంది.  ఈ పోటీల్లో 22 దేశాలకు చెందిన రాంకింగ్‌ ఆటగాళ్ళు జట్లు పోటీపడుతున్నాయి. విశాఖ సాగర తీరమే వేదికగా జరగబోయే పోటీలు క్రీడాభిమానులకు ఓ వినూత్న ఉత్సాహాన్ని ఇవ్వనున్నాయి. ఈ పోటీలు 28వ తేదీనుంచి మార్చి మూడో తేదీ వరకు జరగనున్నాయి.  లాంఛనంగా పోటీలు 27న రామకృష్ణా బీచ్‌లో ఏర్పాటు చేసిన వేదికపై ప్రారంభం కానున్నాయి. ఆటగాళ్లు ప్రారంభవేడుకలో కాట్‌ వాక్‌ చేయనుండడం ప్రత్యేక అకర్షణగా నిలవనుంది. ప్రపంచ వాలీబాల్‌ సమాఖ్య నిబందనల మేరకు ప్రత్యేకమైన ఇసుకతో కోర్టుల్ని ఏర్పాటు చేశారు. దాంతో విశాఖ క్రీడాభిమానులకు బికినీలతో బీచ్‌ వాల్‌బాల్‌ ఆడుతున్న క్రీడాకారిణుల ఆట కనువిందు చేయనుంది. గతంలో విశాఖ సాగరతీరంలో నేషనల్‌ బీచ్‌ వాలీబాల్‌ పోటీలు జరిగినా ఈసారి వివిధ దేశాల క్రీడాకారులు, క్రీడాకారిణులు వస్తూ ఉండడం ఓ విశేషమే.

పాల్గొంటున్న దేశాలు
  భారత్‌తో పాటు ఆస్ట్రియా, చెక్‌ రిపబ్లిక్, డెన్మార్క్, ఇజ్రాయిల్, జపాన్, మలేషియా, రష్యా, సింగపూర్, దక్షిణాఫ్రికా, అమెరికా, వనౌతా దేశాలకు చెందిన మహిళా జట్లు పాల్గొంటుండగా వీటితో పాటు పురుషుల విభాగంలో కెనడా, చైనీస్‌ తైపే, జర్మనీ, ఇరాన్, లాత్వియా, నార్వే, పొలెండ్, ఖతార్, స్లొవేనియా, తుర్కుమెనిస్తాన్, ఉక్రేయిన్‌కు చెందిన జట్లు పాల్గొంటున్నాయి.వరల్డ్‌ టూర్‌ బీచ్‌ వాలీబాల్‌ చాంపియన్‌షిప్స్‌ను ఐదు స్టార్ల టోర్నీలుగా విభజిస్తారు.  వాటిలో ప్రస్తుతం విశాఖ సాగరతీరంలో జరిగే టోర్నీ స్టార్‌ వన్‌ వేదికగా ఉంది. 21 దేశాల్లోని వేదికల్లో ఈ పోటీలు జరుగుతాయి.   ఇక స్టార్‌ టూలో ఏడు వేదికలున్నాయి.  స్టార్‌ 3లో ఐదు వేదికలున్నాయి. స్టార్‌ ఫోర్‌లో 12 వేదికలు, చివరిదైన స్టార్‌ 5 వేదికలుగా నాలుగు దేశాల్లో ఉన్నాయి. ఆయా జట్ల రాంకింగ్‌లను బట్టి ఈ వరల్ట్‌ టూర్‌ బీచ్‌ వాలీబాల్‌ పోటీల్లో పాల్గొంటారు.

మెయిన్‌ డ్రాకు...
జట్ల రాంకింగ్‌ను బట్టి మెయిన్‌ డ్రాకు అర్హత కల్పిస్తారు.  మెయిన్‌ డ్రాలో పదహారు జట్లకు మాత్రమే అర్హత ఉంటుంది.  మెయిన్‌ డ్రాకు కొన్ని జట్లను క్వాలిఫైయింగ్‌ రౌండ్ల ద్వారా అర్హత కల్పిస్తారు. సింగిల్‌ ఎలిమినేషన్‌తో నిర్వహించి అర్హత కల్పిస్తారు.  ఇక మెయిన్‌ డ్రాకు అర్హత పొందిన వాటిని నాలుగు పూల్స్‌గా విభజించి లీగ్‌ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తారు.  తొలిరెండు స్థ్దానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్‌ ఫైనల్స్, సెమీస్‌ ఆడతాయి.  అనంతరం సెమీస్‌ లూజర్స్‌తో మూడోస్థానానికి పోటీ జరుపుతారు. ఆపై టైటిల్‌ కోసం తుదిపోరు నిర్వహిస్తారు.

ఫ్లడ్‌లైట్లలో పోటీలు
క్వాలిఫయింగ్‌ రౌండ్లు 28న ఉదయం ఏడున్నర గంటల నుంచే ప్రారంభం కానుండగా ప్రధాన పోటీలు మధ్యహ్నం మూడున్నర గంటల నుంచే జరగనున్నాయి. సాయంత్రం మ్యాచ్‌ల కోసం ఫ్లడ్‌లైట్లను సాగరతీరంలోని కోర్టుల్లో ఏర్పాటు చేశారు.  
పురుషుల విభాగం: మెయిన్‌ డ్రాకు ఇరాన్‌కు చెందిన వకిలి– సలేమీ జోడీ ఒకటో పొజిషన్‌లో ఉంది. రెండో స్థానంలో సింగపూర్‌కు చెందిన తే–షెన్‌ జోడీ ఉంది. భారత్‌ విషయానికి వస్తే నరేష్‌– రాజు జోడీ పదో స్థానంతో ఎంట్రీ పొందింది.
మహిళా విభాగం: చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన బొన్నేరొవా–మాక్సిన్‌రోవా జోడీ 776ఎంట్రీ పాయింట్లతో ఒకటో పొజిషన్‌తో మెయిన్‌ డ్రాకు అర్హత సాధించింది.  జపాన్‌కు చెందిన చియో–సకగుచి రెండో స్థానంలో, ఇజ్రాయిల్‌కు చెందిన స్టార్లోకోవ్‌–దవే మూడో స్థానంలో ఉండి మెయిన్‌ డ్రాకు అర్హత సాధించారు.  భారత్‌ నుంచి దియాస్‌–స్టెఫీ జోడీ పదో పొజిషన్‌లో షాలిని–సుప్రజ పదకొండో పొజిషన్‌లో ఉన్నారు.

భారత్‌కు అవకాశం
భారత్‌ నుంచి ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య హోదాలో మూడేసి జట్లకు మెయిన్‌ డ్రాకు అర్హత లభించింది. మహిళల విభాగంలో దియాస్‌–స్టెఫీ, ఆర్తీ లక్షి– సబిత, లావణ్య– రాజిత, షాలిని– సుప్రజ, యోగేశ్వరి– జెన్నిఫర్‌ జోడీలు పాల్గొంటున్నాయి. పురుషుల విభాగంలో నరేష్‌–కృష్ణంరాజు , రామ–ఆరోన్, ధావస్కర్‌–అనిల్‌ జోడీలు మెయిన్‌ డ్రాకు అర్హత సాధించగా క్వాలిఫైయింగ్‌ రౌండ్స్‌లో చైతన్య–రాజేష్, వివేక్‌–వివేక్‌రాజ్‌  పోటీపడనున్నారు.

టిక్కెట్లు...
భారత్‌లోనే తొలిసారి ఈ తరహా పోటీలు జరుగుతున్నాయి. పోటీలు వీక్షించడానికి నిర్వాహకులు టిక్కెట్లను విక్రయిస్తున్నారు. కనీస ధర ఐదు రూపాయలు కాగా రూ.750 టిక్కెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీవీఐపీలకు రెండు వేల టిక్కెట్లను ఆన్‌లైన్‌లో టిక్కెట్‌జెనీ.ఇన్‌ వెబ్‌లో ఉంచారు. అన్ని మాచ్‌లకు చూసేందుకు వీలుగా సీజన్‌ టికెట్‌ను ఇవ్వనున్నారు. వేదిక వద్ద టికెట్‌ కౌంటర్‌ ఏర్పాటు చేసినట్టు నిర్వాహాకులు తెలిపారు. ఐదువేల మంది కూర్చొని చూసేందుకు తగిన గాలరీని ఏర్పాటు చేశారు.

ఆట ఇలా...
వాలీబాల్‌కు, బీచ్‌ వాలీబాల్‌కు పోలికలు,  కొన్ని తేడాలున్నాయి. సాధారణ వాలీబాల్‌లో ఆరుగురు ఆటగాళ్లు కోర్టులో ఉంటే బీచ్‌ వాలీబాల్‌ కేవలం ఇద్దరే ఆటగాళ్లతో కొనసాగుతుంది. చాలా పోలికలతో పాటు కొన్ని తేడాలు కూడా ఉంటాయి. తమ కోర్టులో పడ్డ బంతిని మూడో టచ్‌తో ప్రత్యర్ధి కోర్టులోకి పంపాలి. ఇందులో బ్లాక్‌ టచ్‌కూడా భాగమే. ర్యాలీ స్కోర్‌ పద్ధతిలో జరుగుతుంది. బంతి సక్రమంగా లాండ్‌ అయిన సర్వీస్‌ చేసిన వారికే పాయింట్‌ వస్తే తిరిగి వారే సర్వీస్‌ చేయచ్చు. ఇక్కడ రొటేషన్‌ పాటించాల్సి ఉంటుంది. వాలీ పాసింగ్, అటాక్, డిఫెన్స్, జంపింగ్‌ అనేవి ఆటలో ప్రత్యేక నైపుణ్యాలు. ఎఫ్‌ఐవిబి నిబంధనల మేరకు చిన్ని షార్ట్‌ లేదా బాతింగ్‌ సూట్‌తో, టాంక్‌ టాప్‌తో మాత్రమే ఆడతారు. పురుషులు టాప్‌ లేకుండా ఆడవచ్చు. బీచ్‌లో, కడలి అలల సవ్వడులను ఆస్వాది స్తూ, ఆ చల్లగాలిలో సేద తీరుతూ క్రీడాభిమానులు ఆటను ఎం జాయ్‌ చేస్తూ ఉండడంతో బీచ్‌ వాలీబాల్‌కు ఎక్కడ లేని క్రేజ్‌ వ చ్చింది. విదేశీయుల జీవన విధానంలో బీచ్‌కు అధిక ప్రాధాన్యం ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ క్రీడకు విశేష ఆదరణ లభించింది.

కోర్టు చిన్నది
వాలీబాల్‌ కోర్టు (వైశాల్యం 18్ఠ9 మీటర్లు)కంటే బీచ్‌ వాలీబాల్‌ కోర్టు చిన్నగా (16్ఠ8మీటర్లు) ఉంటుంది. ఫ్రీజోన్‌ మూడు మీటర్లుంటుంది. మార్కింగ్‌ లైన్‌ 5సెంటీమీటర్లుంటుంది,  అదీ ఇసుక కాబట్టి మందమైన రంగురిబ్బన్‌ ఉంటుంది. కోర్టుకు సెంటర్‌ లైన్‌ ఉండదు. సైడ్‌లైన్స్, ఎండ్‌లైన్స్‌ మాత్రమే ఉంటాయి. ఇది సీనియర్స్‌ కోసం నిర్వహిస్తున్న టోర్నీ కనుక కోర్టు మధ్యనుంచి పురుషుల కోర్టులో 2.43 మీటర్ల ఎత్తులో.. మహిళలకు 2.24 మీటర్ల ఎత్తులో నెట్‌ ఉంటుంది. ఎంటీనా కోర్టులో భాగంగానే పరిగణిస్తారు. బంతి 260 నుంచి 280 గ్రాముల బరువు ఉంటుంది.  ప్రతీ మ్యాచ్‌కు మూడు బంతుల్ని వినియోగిస్తారు.

గెలుపు ఇలా..
బెస్ట్‌ ఆఫ్‌ త్రీ సెట్స్‌గానే జరగుతుంది. రెండు పాయింట్ల తేడాతో ఎవరైతే 21 పాయింట్లు సాధించగలరో ఆ జట్టే సెట్‌ను గెలిచినట్టవుతుంది.  ఇలా రెండు సెట్లు ఒక జట్టే గెలుచుకుంటే మ్యాచ్‌లో విజయం సాధించినట్టే. సెట్‌ టై (20 ఆల్‌) అయితే రెండు పాయింట్లు తేడా వరకు ఆడతారు.  చెరో సెట్‌ గెలుచుకుంటే మూడో సెట్‌ మాత్రం 15 పాయింట్లకే జరుగుతుంది.   

టోర్నీ షెడ్యూల్‌ ఇదీ..
బీచ్‌ వాలీబాల్‌ పోటీల్లో పాల్గొనే జట్లు 27న విశాఖకు చేరుకుంటాయి. 28న క్వాలిఫయింగ్‌ రౌండ్‌ పోటీలుంటాయి.  మెయిన్‌ డ్రాకు అర్హత సాధించిన జట్లు 28న విశాఖ చేరుకుంటాయి.  మెయిన్‌ డ్రా టోర్నీ మార్చి1 నుంచి 3 వరకు ఉంటుంది. రెండున క్వార్టర్‌ ఫైనల్స్, సెమీఫైనల్స్‌ జరుగుతాయి. మూడో తేదీన పురుషులు, మహిళల విభాగాలలో టైటిల్‌ పోరు ఉంటుంది.  ఆదే రోజు జరిగే ముగింపు వేడుకతో వరల్డ్‌టూర్‌ బీచ్‌ వాలీబాల్‌ ముగియనుంది.      –ఎఫ్‌ఐవిబి సాంకేతిక ప్రతినిధి జోప్‌ వాన్‌ ఇరిసెల్‌

గత విజేత గ్రీస్‌
2 స్టార్‌ పోటీల్లో భాగంగా గతేడాది ఫిబ్రవరి కంబోడియాలో జరిగిన పోటీల్లో గ్రీస్‌ మహిళా జట్టు విజేతగా నిలిచింది. అర్వంతి– కరగ్కొని జోడీ టైటిల్‌ పోరులో అమెరికాకు చెందిన అమందా– కొరిన్ని జోడీపై 2–0 (21–14, 21–17) స్కోరుతో విజయం సాధించి టైటిల్‌ అందుకుంది. స్టార్‌ వన్‌ పోటీలు విశాఖ వేదికగా జరుగుతున్నాయి.  గతేడాది హేగ్‌లో జరిగిన స్టార్‌ వన్‌ ఫైనల్లో రష్యా 2–0తో జర్మనీపై విజయం సాధించింది.–రాష్ట్ర వాలీబాల్‌ సంఘం కార్యదర్శి రమణారావు

మనది 50వ దేశం
అంతర్జాతీయ వాలీబాల్‌ ఫెడరేషన్‌ వరల్డ్‌ టూర్‌ను నిర్వహించనున్న 50వ దేశం భారత్‌.  2010 తర్వాత ఆసియా దేశాల్లో తొలిసారిగా బీచ్‌ వాలీబాల్‌ నిర్వహిస్తున్న దేశమూ మనదే. అదీ విశాఖ వేదికగా నిర్వహిస్తుండటం గర్వకారణం. ఈ తరహా టోర్నీ నిర్వహించడానికి సహజసిద్ధమైన సాగరతీరం ఉండాలి. అది మనకు ఉంది. అందుకే మన దేశంలో తొలిసారిగా విశాఖ వేదిౖది.జీవీఆర్‌ నాయుడు, రాష్ట్రవాలీబాల్‌ సంఘం అధ్యక్షుడు

మరిన్ని వార్తలు