బహుదూరపు సైకిల్ నారి

12 Aug, 2016 01:46 IST|Sakshi
బహుదూరపు సైకిల్ నారి

ఆమె ఆర్మ్‌స్ట్రాంగ్‌కు అక్క కాదు... కానీ ఆటలో అతనికి ఏ మాత్రం తక్కువ కాదు. అమ్మతనం ఆమె దృష్టిలో ఆరోహణకు అవరోధం కాదు... అసలు అదే ఆమె విజయరహస్యం. నాలుగు పదులు దాటిన స్త్రీ అంటే ఇంకేం చేస్తుంది అనేవారిని చూస్తే ఆమె జాలిపడుతుంది. 43 ఏళ్ల వయసులో సైకిలెక్కి 53 కిలోమీటర్ల వేగంతో ‘ప్రపంచాన్ని’ గెలిచిన తనను చూసి నేర్చుకోమంటుంది. ఒక వైపు ఆరేళ్ల బాబుకు తల్లి బాధ్యతలు, మరో వైపు ఆస్పత్రిలో ఉద్యోగ బాధ్యతలు... అయినా ఆటపై తీరని మమకారం. ఎంతో ‘స్ట్రాంగ్’గా జీవిత ట్రాక్‌పై అన్నింటినీ సమర్థంగా బ్యాలెన్స్ చేసుకున్న ఆ అద్భుతం పేరు క్రిస్టిన్. ఆడవాళ్లూ మీకు జోహార్ అంటూ అభిమానంతో ఎవరైనా అనాలని అనుకుంటే అలాంటి జాబితాలో అగ్రస్థానంలో చేర్చాల్సిన పేరు.
 
 ప్రపంచంలోనే అత్యంత పోటీ ఉండే ఒలింపిక్స్... సైక్లింగ్‌లో టైమ్ ట్రయల్ విభాగం... దూరం 29.7 కిలోమీటర్లు... రేసు ముగిసింది... 44 నిమిషాల్లో అమెరికా అథ్లెట్ గమ్యం చేరింది.... ఇందులో వింతేముంది..? ఎవరో ఒకరు గెలవాలిగా..? అవును... ఎవరో ఒకరు గెలిస్తే వింతేం కాదు... కానీ గెలిచింది 42 ఏళ్ల మహిళ. అది కూడా వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌లో స్వర్ణం... పోటీకి శరీరం సహకరించనంటున్నా... రేసు ఆఖరి దశలో ముక్కు వెంట రక్తం కారుతున్నా... కళ్లు మసక బారినా... ఓ వైపు వర్షంతో వాతావరణం ప్రతికూలంగా ఉన్నా... క్రిస్టిన్ ఆర్మ్‌స్ట్రాంగ్ గెలిచింది. సంకల్పం ఉంటే వయసుతో సంబంధం లేకుండా విజయాలు సాధించవచ్చని నిరూపించింది.
 
 ఆల్‌రౌండర్
 క్రిస్టిన్ ఆర్మ్‌స్ట్రాంగ్‌కు జీవితంలో ఎత్తుపల్లాలు బాగా తెలుసు. చిన్నతనంలో స్విమ్మింగ్‌లో మేటి... కాలేజీ రోజుల్లో రన్నర్‌గా రాణించింది... ఆ తర్వాత సైక్లింగ్‌లోకి వచ్చింది. ఈ మూడింటినీ కలిపి ట్రయథ్లాన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది.  అమెరికాలోని ఇదహో రాష్ట్రం బోయిస్‌లో వైఎంసీఏ ఫ్యామిలీ పూల్‌లో గంటల తరబడి ప్రాక్టీస్ చేసేది. చిన్న వయసులోనే వైఎంసీఏ పూల్‌కీ ఆక్వాటిక్స్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహించింది. ట్రైఅథ్లెట్‌గా మారి కెరీర్‌లో దూసుకుపోతున్న సమయంలోనే 2001లో (అప్పుడు ఆమె వయసు 27) ఆస్టియోఆర్థ్రిటిస్ బారిన పడి నడుముకు ఆపరేషన్ చేసుకోవాల్సి వచ్చింది. ఓవైపు క్రీడా జీవితంలో వెలుగు చూడాలనే లక్ష్యం.. మరోవైపు భవిష్యత్తు ఏంటనే భయం. ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితుల్లో కూరుకుపోయింది.
 
 ఆత్మవిశ్వాసం ఆయుధంగా...

 నడుముకు ఆపరేషన్ కారణంగా ట్రయథ్లాన్‌కు దూరం కావాల్సి వచ్చింది. దీంతో స్విమ్మింగ్, రన్నింగ్‌లను పక్కన పెట్టి పూర్తిగా సైక్లింగ్‌పై దృష్టిపెట్టింది. కుటుంబసభ్యులు వద్దని వారించినా... తన సత్తా ప్రపంచానికి చూపాలనే లక్ష్యంతో... ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ప్రాక్టీస్ ప్రారంభించింది. అమెరికా జాతీయ సైక్లింగ్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచినా నిరాశ చెందలేదు. 2005, 06, 07లలో వివిధ అంతర్జాతీయ ఈవెంట్లలో సత్తా చాటింది. 2008లో టూర్ ఆఫ్ న్యూజిలాండ్, నేచర్ వ్యాలీ గ్రాండ్ ప్రి పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి... ఆత్మవిశ్వాసంతో బీజింగ్‌కు వెళ్లింది. రోడ్ టైమ్ ట్రయల్ పోటీలో రికార్డు టైమింగ్‌తో (35 నిమిషాల్లో) బంగారు పతకం గెలిచి అందరినీ ఆశ్చర్య పరిచింది. అప్పటి వరకు ఆమె సాధించిన అత్యుత్తమ పతకం ఇదే.
 
 మళ్లీ మళ్లీ రిటైర్‌మెంట్‌ను వీడి...
 2009లో కుటుంబం కోసం తాత్కాలిక రిటైర్మెంట్ ప్రకటించింది క్రిస్టిన్. అయితే.. 2010 చివర్లో మళ్లీ పోటీ ప్రంపంచంలోకి రావాలనుకుంటున్నట్లు ప్రకటించింది. 2011లో సీ ఒట్టర్ క్లాసిక్ ఈవెంట్లో మొదటి స్థానంలో నిలిచి.. పునరాగమనాన్ని ఘనంగా చాటింది. ఇదే జోరులో లండన్ ఒలింపిక్స్ బరిలో దిగి మరోసారి బంగారు పతకం గెలుచుకుంది. సైక్లింగ్‌లో ఒలింపిక్స్ మెడల్ అందుకున్న పెద్ద వయస్కురాలిగా (38 ఏళ్లు) రికార్డు సృష్టించింది. ఆ వెంటనే మరోసారి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది. అయితే మూడేళ్ల తర్వాత 2015లో మళ్లీ వస్తున్నానని ప్రకటించింది. మెక్సికోలో జరిగిన పాన్ అమెరికన్ రోడ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంది.
 
  యూఎస్ నేషనల్ టైమ్ ట్రయల్ చాంపియన్‌షిప్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఒలింపిక్స్ సెలక్షన్స్‌లో సత్తాచాటి రియో ఫ్లైట్ ఎక్కింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ.. మరోసారి స్వర్ణంతో శభాష్ అనిపించుకుంది. 44.26.32 టైమింగ్‌తో మొదటి స్థానంలో నిలిచి.. రిటైర్మెంట్ ప్రకటించింది. సైక్లింగ్‌లో మూడు ఒలింపిక్స్ బంగారు పతకాలు గెలవటమంటే మాటలు కాదు. అదీ వరుస ఒలింపిక్స్‌లో. వయసు పెరుగుతుంటే శరీరం సహకరించదు. కానీ.. క్రిస్టిన్ ఆర్మ్‌స్ట్రాంగ్ మాత్రం రోజు రోజుకూ శక్తి పెంచుకుంటూ దూసుకెళ్తోంది.
 
బాబు పెద్దయ్యాక చెబుతా..
రియోలో రేసు గెలిచాక.. అలసిపోవటంతో క్రిస్టిన్ కిందపడిపోయింది. ఓ వైపు బాధ... మరోవైపు ఆనందం... అంతలోనే కళ్లు ఎవరికోసమో వెతికాయి... కాసేపటికి తను వెతుకుతున్న ఆరేళ్ల కుమారుడు లుకాస్ కనిపించాడు. పరిగెడుతూ వె ళ్లి బాబును హత్తుకుని ఏడ్చింది. దీంతో లూకాస్ ‘అమ్మా ఎందుకేడుస్తున్నావ్? నువ్వు గెలవలేదా?’ అని ప్రశ్నించాడు. ‘గెలిస్తే కూడా కన్నీళ్లొస్తాయని ఇప్పుడు చెప్పినా బాబుకు అర్థం కాదు. ఇదో జీవితపాఠం. పెద్దయ్యాక అది చెబుతా’ అని క్రిస్టిన్ చెప్పింది. అన్నట్లు మెడల్ తీసుకోవడానికి వెళ్లేటప్పుడు లుకాస్‌ను కూడా తీసుకెళ్లింది.
 
‘పెద్దయ్యాక ఈ ఫొటో చూసి ఇదే స్ఫూర్తితో లుకాస్ కూడా మరింత ఎత్తుకు ఎదగాలి’ అనేది ఆ తల్లి ఆలోచన. ఎందుకు రెండుసార్లు రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ వెనక్కు రావడం..? అమెరికా మీడియాకు కూడా ఇదో పెద్ద ప్రశ్న. ‘ఒలింపిక్ పతకం గెలిచాక జాతీయ గీతం వినిపిస్తూ ఉంటే మెడల్‌ను ముద్దాడటం మాటల్లో చెప్పలేని అనుభూతి. రిటైరైనా ఆ క్షణాలే గుర్తుకు వచ్చాయి. అందుకే రియో ఒలింపిక్స్‌కి కూడా వచ్చా’ అని తెలిపింది. అయితే 2020 టోక్యో ఒలింపిక్స్‌కు మాత్రం రిటైర్మెంట్‌ను విరమించుకోబోనని, రియోతోనే కెరీర్ ముగిసిందని చెప్పింది.

మరిన్ని వార్తలు